శ్రీ మేధా దక్షిణామూర్తి జ్యోతిష నిలయం

మీరు జన్మించిన తేది, సమయం, ప్రదేశం ఈ మూడు సమాచారములు మాకు తెలియచేసినచో మీ వ్రుత్తి,వ్యాపార,ఆరోగ్య,ఆర్ధిక పరిస్తితులు, దాంపత్యం, విద్య, ఉద్యోగ, వివాహ, కుటుంబవ్యవహారాలు, సంతానం, రాజకీయ వ్యవహారాలు,ప్రేమ వ్యవహారములు,కుజ దోషం, కాలసర్ప దోషం మరియు వివాహ, ఉపనయన, గృహప్రవేస, జప, హోమ, వ్రత, అన్నప్రసన, నామకరణం లకు ముహూర్తములు పెట్టబడును. P.V.RADHAKRISHNA CELL :+91 9966455872, Mail us : parakrijaya@gmail.com

18, సెప్టెంబర్ 2012, మంగళవారం

గ్రహముల ద్వాదశ భావాశ్రయ ఫలములు - గురుడు

గురు:-

గురుడు లగ్న, ద్వితీయ, తృతీయ, చతుర్ధ భావములయందున్న ఫలము :

గురుడు లగ్నకేంద్రమునయున్న జాతకుడు రూపవంతుడు, అదృష్టవంతుడు, చిరంజీవి, నిర్భయుడు, సంతానవంతుడు అగును. గురుడు ద్వితీయమున యున్న జాతకుడు స్వచ్చమగు వాకులు గలవాడు, భోజనప్రియుడు, సుందరవదనుడు, ధనవంతుడు, విద్యావంతుడు అగును. గురుడు తృతీయమునయున్న జాతకుడు అమర్యాదస్తుడు (మర్యాద తెలియనివాడు), కష్టముతో జీవించువాడు, ఖ్యాతిగల సోదరవర్గము కలవాడు, పాపములు చేయువాడు, మావియగును. చతుర్దభావమున గురుడుండిన జాతకుడు మిత్ర మాతృ సేవాజనముతో జీవించువాడు, భార్యాపుత్ర ధనధాన్య సంపద్విభవుడు, సుఖీ అగును.

గురుడు పంచమ, షష్ట, సప్తమ, అష్టమ స్థానములందున్న ఫలము :

గురుడు పంచమభావమునయున్న జాతకుడు పుత్రులవలన క్లేశములు గలవాడు అగును. మరియూ మేథావి, రాజసచివునిగను యుండును. గురుడు షష్టమునయున్న జాతకుడు నిరుత్సాహి, అగౌరవములు పొందువాడు, శతృనాశనకారి, మంత్రాభినివేశము కలవాడగును. గురుడు సప్తమమునయున్న జాతకుడు సత్కళత్ర, సుపుత్రులను బడయును, వినయసంపన్నుడు, అతి ఉదారుడూ అగును. గురుడు అష్టమమునయున్న జాతకుడు కడుబీదవాడగునూ, బహుతక్కువ సంపాదనాపరుడు, పాపి, అయిననూ చిరంజీవి అగును.

గురుడు భాగ్య, రాజ్య, లాభ, వ్యయ భావములయందున్న ఫలము :

గురుడు భాగ్యమందున్న జాతకుడు ఖ్యాతి వహించిన మంత్రిగనూ, సంతతీ ఐశ్వర్యము గలవానిగానూ, పవిత్రకార్యాభిలాషిగనూ యుండును. గురుడు రాజ్యము నందున్న జాతకుడు బుజువర్తనుడు, తన పవిత్రకార్యములచేత ప్రఖ్యాతి వహించినవాడు, బహుధనవంతుడూ, రాజమిత్రుడూ అగును. గురుడు లాభమునందుయున్న జాతకుడు ధనవంతుడు, నిర్భయుడు, అల్పసంతానవంతుడు; చిరంజీవి, వాహనయానపరుడు అగును. గురుడు ద్వాదశమునయున్న జాతకుడు యితరుల చేత అసహ్యించుకొనబడువాడు. అసంగతప్రలాపి, అప్త్రవంతుడు, పాపకృత్యములు చేయువాడు అలసినవాడు అగును.

17, సెప్టెంబర్ 2012, సోమవారం

గ్రహముల ద్వాదశ భావాశ్రయ ఫలములు - బుధుడు

బుధ:-

బుధుడు లగ్న, ద్వితీయ, తృతీయ, చతుర్థ భావములయందున్న ఫలము :

లగ్నమున బుధుడుండిన జాతకుడు దీర్ఘాయుష్షుకలవాడు, మృదుమధుర వాక్సంపన్నుడు, సునిశిత హాస్యవాక్చాతురుడు అగును. బుధుడు ద్వితీయమునయున్న జాతకుడు స్వశక్తితో ఆస్తులను సంపాదించువాడు, కవి - ఆకర్షణీయమయిన ప్రస్ఫుటవాక్కులు కలవాడు యిష్ఠాన్నభోక్తయగును. బుధుడు తృతీయమునయున్న జాతకుడు ధైర్యశాలి, శూరుడు, సమ ఆయుష్మంతుడు, సత్సోదరయుతుడు, అలసట పొందు స్వభావము కలవాడునగును. బుధుడు చతుర్ధభావమునయున్న జాతకుడు విద్యావంతుడు హాస్యవచో విశారదుడు, భూమి, మిత్రులు, ధాన్య, ఐశ్వర్యము - సంతోషముతో కూడినవాడు యగును.

బుధుడు పంచమ, షష్ట, సప్తమ, అష్టమ స్థానములయందున్న ఫలము :

పంచమభావమున బుధుడుండిన జాతకుడు విద్యావంతుడు, సుఖవంతుడు, శౌర్యవంతుడు, మంత్రవిద్యాభినివేశి, పుత్రవంతుడు అగును. బుధుడు షష్టమభావమునయున్న జాతకుడు వివాదాస్పదుడు, క్రోధి, నిష్టురవాకులయందు నేర్పరి, రిపునాశనకర్త, అలసట కలవాడు, నిష్టురోక్తిపరుడు అగును. బుధుడు సప్తమమున యున్న జాతకుడు విద్యావంతుడు, సుందరవస్త్రధారి, ఔన్నత్యవంతుడు, ధనసంపన్నవతియగు భార్యగలవాడూయగును. బుధుడు అష్టమమునయున్న జాతకుడు మిక్కిలి ప్రఖ్యాత్వంతుడు, చిరంజీవి, కుటుంబమునకు అండగా యుండుట, ప్రభువు లేక సేనానివహము లకధిపతి యగును.

బుధుడు భాగ్య, రాజ్య, లాభ, వ్యయభావములయందున్న ఫలము :

బుధుడు భాగ్యభావమునయున్న జాతకుని విద్య, ఐశ్వర్యమూ, సచ్ఛరిత్ర, ఆచారము, ప్రావీణ్యము, స్వచ్ఛమగు, వాక్కులు గలవానినిగాచేయును. బుధుడు రాజ్యకేంద్రమున యున్న జాతకుడు తానారంభించు సకలకార్యములయందునూ విజయుడూ, మంచివిద్య, శక్తి, మేథ, సుఖము, సత్ప్రవర్తన, సత్యసంధత కలవాడును యగును. బుధుడు యేకాదశభావమునయున్న జాతకుడు చిరంజీవి, సత్యసంధుడు, బహుధనవంతుడు, సుఖీ మరియూ సేవాజనము కలవాడునగును. బుధుడు ద్వాదశభావమునయున్న జాతకుడు కష్టజీవి, విద్యాహీనుడు, నమ్రతతో యుండువాడు, కౄరుడు, నిస్తేజుడూ యగును.

16, సెప్టెంబర్ 2012, ఆదివారం

గ్రహముల ద్వాదశ భావాశ్రయ ఫలములు - కుజుడు

 మంగళ:-

కుజుడు లగ్న, ద్వితీయ, తృతీయ, చతుర్థములయందున్న ఫలము :

లగ్నమునందుకుజుడు యున్న, అట్టిజాతకుడు, క్షతగాత్రుడు, కౄరుడు అల్పాయుష్మంతుడు, సాహసియగును. కుజుడు ద్వితీయమునందున్న జాతకుడు - కురూపవంతుడు, విద్యావిహీనుడు, ధనహీనుడు, దుష్ప్రజలమీద ఆధారపడువాడూ యగును. తృతీయమునందు కుజుడుయున్న జాతకుడు మంచిఅలవాట్లు కలవాడు, ధనవంతుడు, ధైర్యశాలి, అప్రతిహతుడు, సుఖవంతుడు, సోదరశూన్యుడూ యగును. చతుర్థమున కుజుడుండిన జాతకునకు మిత్ర, మాతృ, భూ, గృహ, సుఖ, వాహనముల లేమి కలుగును.

కుజుడు పంచమ, షష్ట, సప్తమ, అష్టమ భావములయందున్న ఫలము :

పంచమ భావమున కుజుడున్న అట్టిజాతకుడు సుఖహీనత, నిస్సంతు, అల్పమేథావి, భాగ్యములకు అనర్ధములు కలుగును. కుజుడు షష్టభావమునయున్న జాతకుడు - అతికాముకుడు, ధనవంతుడు కీర్తికలవాడు, విజయుడూ అగును. కుజుడు కళత్రభావమునయున్న జాతకుడు దుశ్చరితుడు, వ్యాధిపీడితుడు, వృధాత్రిప్పట, భార్యానష్టము కలుగును. అష్టమమున కుజుడుండిన జాతకుడు అంగవైకల్యము పొమ్దును. నిర్ధనుడు, అల్పజీవి, జననిందితుడు అగును.

కుజుడు భాగ్య, రాజ్య, లాభరిఃఫ స్థానములయందున్న ఫలము :

కుజుడు భాగ్యభావమునయున్న జాతకుడు రాజమిత్రుడు, ప్రజలచే ద్వేషింపబడువాడు, పితృహీనుడు, జనఘాతకుడు అగును. కుజుడు రాజ్యప్రభావమున యున్న జాతకుడు కౄరస్వభావము కలరాజగును. విశాలహృదయుడు, ప్రజామన్ననలందుకొనువాడగును. కుజుడు ద్వాదశభావమునయున్న జాతకుడు ధనసుఖములతో తులతూగువాడు, ధైర్యశాలి, విగతశోకవంతుడు, సచ్ఛరిత్రుడూ యగును.


15, సెప్టెంబర్ 2012, శనివారం

గ్రహముల ద్వాదశ భావాశ్రయ ఫలములు - చంద్రుడు

చంద్ర :-

చంద్రుడు లగ్న, ద్వితీయ, తృతీయములయందున్న ఫలము :

చంద్రుడు లగ్నమందున్న అట్టిజాతకుడు ధృడశరీరవంతుడూ, చిరంజీవి, నిర్భయుడూ, బలిష్ఠుడూ, ధనవంతుడు అగును. ( వృద్ధి చంద్రుడు ). క్షీణచంద్రుడయిన పై ఫలితములకు వ్యతిరిక్తము అగును. చంద్రుడు ద్వితీయమునందున్న జాతకుడు ధనవంతుడు, విద్యావంతుడు, మృదుభాషి యేదేని అంగవైకల్యమూ కలుగును. చంద్రుడు మూడవయింటనున్న జాతకుడు సోదరులు కలవాడు, ప్రమదాజమనస్కుడు, బలవంతుడు, శౌర్యవంతుడు, అయిననూ బహుకష్టములు పొందును.

చంద్రుడు చతుర్థ, పంచమ, షష్ట ద్వాదశభావములయందున్న ఫలము:

చంద్రుడు చతుర్థభావమునయున్న జాతకుడు సుఖీ, భోగీ, దాతా, మిత్రులు కలవాడు, వాహనములు కలవాడు, కీర్తివంతుడుగా వెలుఒందును. చంద్రుడు పంచమమునయున్న జాతకుడు సుపుత్రులు, సుమేథాసంపద, ఠీవీ, మంత్రిపదవి నలంకరించువాడూ యగును. ఆరవయింట చంద్రుడు యున్న జాతకుడు అల్పజీవి, అమాయకుడు, ఉదరశూలతో బాధపడువాడూ, దైన్యత్వముకలవాడునూ యగును. సప్తమమున చంద్రుడుయున్న జాతకుడు సౌమ్యవంతుడు, సుందరయువతీ హృదయారవిందుడు, అతి సుందర వంతుడునూయగును. ( సౌందర్యవతి యగ్గు భార్య సంప్రాప్తమగును. )

చంద్రుడు అష్టమ, నవమ ,దశమ , లాభ ద్వాదశభావములయందున్న ఫలము :

అష్టమభావమున చంద్రుడు, జాతకుని రోగపీడితుడ్నిగనూ, అల్పాయుష్మంతునిగనూ చేయును. నవమభావమున చంద్రుడు అభివృద్ధిపరునిగనూ,పవిత్రునిగనూ, పుత్రవంతునిగను, విజయునిగను, కార్యారంభముననే శుభఫలములందుటా మొదలగు ఫలములని సహాయము చేయు మనస్కుడూ అగును. ఏకాదశమమున చంద్రుడుయున్న జాతకుడు విశాలహృదయుడూ, చిరంజీవీ, ధనవంతుడూ యగును. ద్వాదశభావమున చంద్రుడు యుండ జాతకుడు ద్వేషి, దుఃఖి, క్లేశములననుభవించువాడు, అవమానింపబడినవాడు, నిరుత్సాహి యగును.

14, సెప్టెంబర్ 2012, శుక్రవారం

గ్రహముల ద్వాదశ భావాశ్రయ ఫలము - రవి

 సూర్య:-

రవి లగ్నమందున్న ఫలము :

రవి లగ్నగతుడయిన అట్టి జాతకుడు అల్పకేశయుతుడు, చిరుపలుకులకే అలసత్వము నొందినవాడు, క్రోధి - ప్రచండస్వభావి - పొడగరి - గర్వి - అల్పదృష్టికలవాడు - ఉద్రేకి - కౄరహృధయుడు - నిర్గుణుడు అగును. అది కర్ణాటక లగ్నమయి అందు రవియున్న కనులయందు పూవులు కలవాడు, మేషము లగ్నమయి అందు రవియున్న నేత్రవ్యాధి పీడితుడు; రవి సింహమందుండి సింహలగ్నమయిన రేచీకటి కలవాడు; తులాలగ్నమయి అందు రవియున్న దారిద్ర్యపీడితుడూ, సంతాననష్టము పొందువాడూ అగును.

రవి ద్వితీయ, తృతీయ, చతుర్థములలో యున్న ఫలములు :

రవి ద్వితీయమునయున్న విద్యాహీనుడు, వినయములేనివాడు, నిర్ధనుడు, దుర్వచనప్రియుడు అగును. రవి తృతీయమునయున్న బలవంతుడు, ధైర్యవంతుడు, ధనవంతుడు, ఉదారుడూ అగును. కానీ, ఆప్తులయందు ద్వేషస్వభావియగును. రవి చతుర్థమునయున్న అట్టిజాతకుడు సుఖహీనుడు, బంధువులు లేనివాడు, క్షేత్రహీనుడు, స్నేహహీనుడు, గృహములేనివాడు అగును. ప్రభుత్వ ఉద్యోగి అగును. పిత్రార్జితమంతయా ఖర్చు పెట్టును.

రవి పంచమ, షష్ట, సప్తమ, అష్టమలయందున్న ఫలము :

రవి పంచమముయందున్న సుఖ, పుత్రహీనుడు, మరియూ అల్పాయుష్మంతుడు, జ్ఞాని, అరణ్యప్రదేశములయందు తిరుగువాడు అగును. రవి ఆరవయింటనున్న జాతకుడు రాజు, ఖ్యాతివంతుడు, ధనవంతుడు, విజయవంతుడు అగును. రవి యెనిమిదవ భావమున యున్న జాతకుడు తన ఆస్తిని పోగొట్టుకొనును. మిత్రనష్టము, అల్పాయుష్మంతుడు దృష్టిలోపము కలవాడగునో - అంధుడగునో యుండును.

రవి భాగ్య, రాజ్య, లాభ, వ్యయ క్షేత్రముల యందున్న ఫలము :

భాగ్యమున రవియున్న తండ్రిలేనివాడు, బంధుమిత్రపుత్రవంతుడు, దేవబ్రాహ్మణ భక్తి కలవాడూ అగును. రాజ్యకేంద్రమున రవియున్న జాతకుడు పుత్రవంతుడు, వాహనయుతుడు, కీర్తియశస్సు, భాగ్యమూకలవాడు, రాజూ అగును. రవి లాభస్థానమునయున్న జాతకుడు బహుధనవంతుడు, చిరంజీవి యగును. రాజు అగును. మరియూ విగశోకవంతుడు అగును. ద్వాదశమున రవియున్న పితృద్వేషి దోషదృష్టి కలవాడు, నిర్ధనుడు, అపుత్రవంతుడు అగును.

10, సెప్టెంబర్ 2012, సోమవారం

నవగ్రహచార ఫలములు - కేతువు

కేతు గ్రహము

కేతు గ్రహ లక్షణాలు :
కేతువు పురుషగ్రహము. చిత్రమైన రంగును రత్నములలో వైఢూర్యము (పిల్లికన్నురాయి) ను సూచించును. మ్లేచ్ఛజాతికి చెందిన తమోగుణ ప్రధానమైన గ్రహము. ఈ గ్రహము సంఖ్య 4. అంతర్వేది ప్రాంతమును సూచించును.
కేతువు అశ్వని, మఖ, మూల, నక్షత్రములకు అధిపతి. కేతుగ్రహదశ 7 సంవత్సరాలు. రవి, చంద్ర, కుజ, గురులు, ఇతనికి మిత్రులు.. బుద, శుక్ర, శని, రాహువులు శత్రువులు. బుద, గురులు సములు.
కేతు గ్రహ కారకత్వములు :
కేతువు తాత (తల్లికి తండ్రి), దైవోపాసన, వేదాంతము, తపస్సు, మోక్షము, మంత్రశాస్త్రము, భక్తి, నదీస్నానం, మౌనవ్రతం, పుణ్యక్షేత్ర దర్శనం, మోసము, పరులసొమ్ముతో ఆనందం, పరుల వాహనములు వాడుకొనుట, దత్తత, రాయి, ఆకలి లేకపోవుటను సూచించును. స్ఫోటకము, రక్తపోటు, చెముడు, నత్తి, దురదలు, గాస్, ఎసిడిటి, వికారములను సూచించును. కోడి, గ్రద్దలను సూచించును. స్నేహము, వైద్యము, జ్వరము, వ్రణములను సూచింఛును.
కేతువు సూచించు విద్యలు :
కేతువు ఏ గ్రహంతో సంబంధం కలిగివుంటే ఆ గ్రహానికి సంబంధించిన విద్యలను సూచించును.
కేతువు సూచించు వ్యాధులు :
కేతువు ఏ గ్రహంతో కలిస్తే ఆ గ్రహముకు సంబంధించిన అవయవము చెడిపోవునట్లు చేస్తాడు. రోగ నిర్ధారణ కానీయడు. దానివలన సరియైన చికిత్స చేయుటకు అవకాశం ఉండదు. ఇతను మృత్యుకారకుడు. అధికంగా భయపడుట, మతిస్థిమితం లేకపోవుట, రక్తపోటు, ఎలర్జీని సూచించును.
కేతువు సూచించు వృత్తి వ్యాపారాలు :
కేతువు ఏదో ఒక సంస్థకు చెందిన ఎగ్జిక్యూటివ్ లను సూచించును.
కేతువు, కుజునిచే సూచించు వృత్తులను సూచించును.
కేతువునకు మిత్రులు: బుధ శుక్ర శని రాహు
కేతువునకు శత్రువులు: సూర్య చంద్ర మంగళ
కేతువునకు సములు: గురు 


7, సెప్టెంబర్ 2012, శుక్రవారం

నవగ్రహచార ఫలములు - రాహువు

రాహు గ్రహము

రాహు గ్రహలక్షణాలు :
రాహువు స్త్రీ గ్రహము. ఇది నలుపురంగును, రత్నములలో గోమేధికమును సూచించును. అధిదేవత గౌరి. ఇది నైరుతి దిక్కును సూచించును.ఈ గ్రహసంఖ్య 2. పొడవైన వారిని, ముసలివారిని సూచించును. ఇతను తమోగుణ ప్రధానుడు బర్భరాదేశమును సూచించును.
రాహువు ఆరుద్ర, స్వాతి, శతభిషం నక్షత్రములకు అధిపతి. రాహుగ్రహదశ 18 సంవత్సరాలు. బుద, శుక్ర, శని ఇతనికి స్నేహితులు. రవి, కుజ, చంద్ర, గురువులు శత్రువులు, బుధ, గురులు సములు.
రాహు గ్రహ కారకత్వములు :
రాహువు పితామహుడు (తాత) , వృద్ధాప్యము, శ్వాస, భాష, అసత్యము, భ్రమ, వాయువు, విచారము, మరకతము, జూదరి, కఫము, సంధ్యాసమయము, రాజ్యము, బయటప్రదేశం, గొడుగు పల్లకి, అపరిశుభ్రము, నులిపురుగులు, గుల్మరోగము, విమర్శ, అంటరానితనము, జూదము, గార్డీ విద్య, పాములు, విషము, విశముతో కూడిన మందులు, పుట్టలు, నాగపూజ, ఎడమచెతితో వ్రాయుట, నీచ స్త్రీ సాంగత్యము, స్మశానము, దొంగతనము, భూతములు, వైద్య శాస్త్రమును సూహించును. నల్లులు, దోమలు, కీటకములు, గుడ్లగూబలును సూచించును. చర్మవ్యాధులు, గుండె నెప్పి, గుండె దడను సూచించును.
రాహువు సూచించు విద్యలు :
రాహువు ఏ గ్రహంతో సంబంధం కలిగి ఉంటే ఆ గ్రహానికి సంబంధించిన విద్యలను సూచించును.
రాహువు సూచించు వ్యాధులు :
రాహువు ఏ గ్రహంతో కలిస్తే ఆ గ్రహానికి సంబంధించిన అవయవము చెడిపోవ్టకు సహాయం చేస్తాడు. ఆయా గ్రహాల రోగాలను కలిగించుటకు ప్రయత్నిస్తాడు. విషాహారం తినుట, పాముకాటు, తేలుకాటు, కుష్ఠు, కాన్సర్ ను కలిగిస్తాడు.
రాహువు సూచించు వృత్తి వ్యాపారాలు :
రాహువు జైళ్ళు, క్రిమినల్ కోర్టులో ఉద్యోగస్థులును, ఎలక్ట్రిసిటీ, మోటారు, నిప్పు, గ్యాస్, ఇనుములకు సంబంధించిన పనులు చేయువారిని సూచించును. రాహువు, శనిచే సూచించబడు వృత్తులను సూచించును.
రాహువునకు మిత్రులు : బుధ శుక్ర శని కేతు
రాహువునకు శత్రువులు : సూర్య చంద్ర మంగళ
రాహువునకు సములు : గురు

ఈ బ్లాగును సెర్చ్ చేయండి



Related Posts Plugin for WordPress, Blogger...