బుధ:-
బుధుడు లగ్న, ద్వితీయ, తృతీయ, చతుర్థ భావములయందున్న ఫలము :
లగ్నమున బుధుడుండిన జాతకుడు దీర్ఘాయుష్షుకలవాడు, మృదుమధుర
వాక్సంపన్నుడు, సునిశిత హాస్యవాక్చాతురుడు అగును. బుధుడు ద్వితీయమునయున్న
జాతకుడు స్వశక్తితో ఆస్తులను సంపాదించువాడు, కవి - ఆకర్షణీయమయిన
ప్రస్ఫుటవాక్కులు కలవాడు యిష్ఠాన్నభోక్తయగును. బుధుడు తృతీయమునయున్న
జాతకుడు ధైర్యశాలి, శూరుడు, సమ ఆయుష్మంతుడు, సత్సోదరయుతుడు, అలసట పొందు
స్వభావము కలవాడునగును. బుధుడు చతుర్ధభావమునయున్న జాతకుడు విద్యావంతుడు
హాస్యవచో విశారదుడు, భూమి, మిత్రులు, ధాన్య, ఐశ్వర్యము - సంతోషముతో
కూడినవాడు యగును.
బుధుడు పంచమ, షష్ట, సప్తమ, అష్టమ స్థానములయందున్న ఫలము :
పంచమభావమున బుధుడుండిన జాతకుడు విద్యావంతుడు, సుఖవంతుడు, శౌర్యవంతుడు,
మంత్రవిద్యాభినివేశి, పుత్రవంతుడు అగును. బుధుడు షష్టమభావమునయున్న జాతకుడు
వివాదాస్పదుడు, క్రోధి, నిష్టురవాకులయందు నేర్పరి, రిపునాశనకర్త, అలసట
కలవాడు, నిష్టురోక్తిపరుడు అగును. బుధుడు సప్తమమున యున్న జాతకుడు
విద్యావంతుడు, సుందరవస్త్రధారి, ఔన్నత్యవంతుడు, ధనసంపన్నవతియగు
భార్యగలవాడూయగును. బుధుడు అష్టమమునయున్న జాతకుడు మిక్కిలి ప్రఖ్యాత్వంతుడు,
చిరంజీవి, కుటుంబమునకు అండగా యుండుట, ప్రభువు లేక సేనానివహము లకధిపతి
యగును.
బుధుడు భాగ్య, రాజ్య, లాభ, వ్యయభావములయందున్న ఫలము :
బుధుడు భాగ్యభావమునయున్న జాతకుని విద్య, ఐశ్వర్యమూ, సచ్ఛరిత్ర, ఆచారము,
ప్రావీణ్యము, స్వచ్ఛమగు, వాక్కులు గలవానినిగాచేయును. బుధుడు రాజ్యకేంద్రమున
యున్న జాతకుడు తానారంభించు సకలకార్యములయందునూ విజయుడూ, మంచివిద్య, శక్తి,
మేథ, సుఖము, సత్ప్రవర్తన, సత్యసంధత కలవాడును యగును. బుధుడు
యేకాదశభావమునయున్న జాతకుడు చిరంజీవి, సత్యసంధుడు, బహుధనవంతుడు, సుఖీ మరియూ
సేవాజనము కలవాడునగును. బుధుడు ద్వాదశభావమునయున్న జాతకుడు కష్టజీవి,
విద్యాహీనుడు, నమ్రతతో యుండువాడు, కౄరుడు, నిస్తేజుడూ యగును.