Friday, 20 January 2012
తారాబలం చూడటం ఎలా?
ముహూర్త నిర్ణయంలో ప్రథానమైనది తారాబలం. ఏ చిన్న ముహూర్తానికైనా మన జన్మ నక్షత్రానికి సరిపోయే నక్షత్రమును మాత్రమే తీసుకోవాలి. జన్మ నక్షత్రం నుండి ముహూర్త సమయానికి ఉన్న నక్షత్రం వరకు లెక్కించగా వచ్చిన సంఖ్యను 9 చే భాగహరించాలి. వచ్చిన శేషాన్ని బట్టి ఫలితం క్రింది విదంగా నిర్ణయించాలి.
1 వస్తే ‘జన్మతార’ అలా వరుసగా....
1) జన్మతార, 2) సంపత్తార, 3) విపత్తార, 4) క్షేమ తార, 5) ప్రత్యక్తార, 6) సాధన తార, 7) నైధన తార, 8) మిత్ర తార, 9) పరమమిత్ర తార.
ఇవేవో అశ్వని, భరణి, కృత్తికల వలే వేరే కొత్త తారలు అనుకోకండి. ఆ 27 నక్షత్రాలకే మన జన్మతారను బట్టి ఈ తొమ్మిది పేర్లు అన్వయించాలి. అంటే ‘విద్యార్థి’ అనే పేరు గల వ్యక్తి ఉన్నాడు. అతను ఒకరికి కొడుకు, ఒకరికి తమ్ముడు, ఒకరికి భర్త అవుతాడు. అలాగే అశ్వనీ నక్షత్రం ఒకరికి జన్మతార అయితే, మరొకరికి సంపత్తార ( సంపదలు కలిగించే తార ) అవుతుంది. మరొకరికి విపత్తార ( విపత్తులు కలిగించే తార ) అవుతుంది. ఎవరికి ఏమవుతుంది అన్నది వారి జన్మనక్షత్రాన్ని బట్టి నిర్ణయించుకోవాలి.
పైవాటిలో సంపత్తార, క్షేమ తార, సాధన తార, మిత్ర తార, పరమమిత్ర తారలు ( 2,4,6,8, 9 తారలు ) సకల శుభకార్యాలు చేసుకోవడానికి పనికి వస్తాయి. వృత్తి,వ్యాపార సంబంధమైన విషయాలు ‘సంపత్తార’ లోను, ప్రయాణాది కార్యాలు ‘క్షేమతార’ లోను, సాధించి తీరాలనుకునే కార్యాలు ‘సాధనతార’ లోను ప్రారంభించడం మరింత మంచిది.
జన్మతార కొన్ని శుభకార్యాలకు పనికొస్తుంది. కొన్నిటికి పనికి రాదు.
చెవులు కుట్టడం, అన్నప్రాశన, అక్షరాభ్యాసం, ఉపనయనం, నిషేకం, యాగం, పట్టాభిషేకం, వ్యవసాయం, భూసంపాదన మొదలైన వాటికి జన్మతారను గ్రహించ వచ్చు.
ప్రయాణం, పెండ్లి, క్షౌరము, ఔషధ సేవనం, గర్భాదానం, శ్రార్థం, సీమంతం, పుంసవనము మొదలైనవి జన్మనక్షత్రంలో చేయరాదు.
ఉదాహరణ : రేవతి నక్షత్రం జన్మ నక్షత్రం అనుకుంటే, ముహూర్త నిర్ణయంరోజు పూర్వాభాద్ర నక్షత్రం ఉంది అనుకుంటే, రేవతికి పూర్వాభాద్ర సరిపోతుందో లేదో తెలుసుకోవాలి. అంటే రేవతి నుండి పూర్వాభాద్ర ఎన్నో నక్షత్రమో లెక్క పెట్టాలి. 26 వ నక్షత్రం అవుతుంది. దానిని తొమ్మితో భాగహరించగా శేషం 8 వస్తుంది. అంటే రేవతికి - పూర్వాభాద్ర ఎనిమిదో తార ( మిత్ర తార ) అవుతుంది. అంటే శుభం కనుక ముహూర్తము పనికొస్తుంది.
శేషం సున్నా వస్తే అది తొమ్మిదిగా గుర్తించాలి.
తప్పని సరి పరిస్థితులలో ముహూర్తనిర్ణయం చేయవలసి వస్తే .....
ప్రథమే ప్రథమం త్యాజ్యం ద్వితీయేతు తృతీయకం
తృతీయే పంచమం త్యాజ్యం నైధనం త్రిషువర్జయేత్ !
ప్రథమ నవకం లో ( 1 నుండి 9 తారలలో )మెట్ట మొదటి తారను,
2 వ నవకం లో ( 10 నుండి 18 తారలలో )మూడవ తారను,
3 వ నవకంలో( 19 నుండి 27 తారలలో )పంచమ తారను,
ప్రతీ నవకంలో 7 వతారను ఎల్లప్పుడు వదిలి పెట్టవలెను.
అంటే జన్మనక్షత్రము లగాయతు 1, 7, 12, 16, 23 మరియు 25 నక్షత్రాలను ఎల్ల వేళలా శుభకార్యములలో వదిలిపెట్టాలి.
అంటే సాధారణంగా జన్మ నక్షత్రం నుండి 1,3,5,7,10,12,14,16,19,21,23 మరియు 25 నక్షత్రాలను శుభకార్యములలో వదిలిపెట్ట వలసి ఉన్నది. కానీ కావలసిన సమయము లోపల ముహూర్తములు కుదరని పక్షమున 1, 7, 12, 16, 23 మరియు 25 తారలు మాత్రం వదిలి మిగతావి రెండవ ఎంపికగా గ్రహించ వచ్చును.