అమ్మాయి పుష్పావతి అయిన సమయములో చేయవలసినవి:
తూర్పు ముఖం వచ్చునట్లుగా నేలమీద గడ్డిపరచి దానిమీద తెలుపు డిజైను దుప్పటి లేక చీర ఐదుగురు ముత్తైదువులు పట్టుకుని వేయవలెను. కొందరి ఇంట తెలుపు డిజైను కొత్త చీర సమర్త పెండ్లికూతురుకు కట్టి మొదటి రోజు కూర్చొనపెట్టుదురు. ఆ ఐదుగురు అక్షింతలు నాలుగు వైపులా, మధ్యలో ఐదుచోట్ల శనగలు, పండ్లు, తాంబూలము, ఎండుకొబ్బరి చిప్ప, చిమ్మిరి ముద్ద పెట్టాలి. పక్కన ఒక చెక్కబొమ్మ పెట్టవలెను. ఆ బొమ్మకు గుడ్డ చుట్టవలెను. అమ్మాయి కాళ్ళకు పసుపు రాసి పారాణి పెట్టాలి. అమ్మాయికి ఓణీ వేయవలెను. 5పోగుల దారానికి పసుపు రాసి తమలపాకు కట్టి ఒకటి రోలుకి, రోకలికి కటాలి. అమ్మాయికి తాంబూలము ఇవ్వవలెను. అమ్మయిని కూర్చోబెట్టి రోలులో 5 చిమ్మిరి ముద్దలు వేసి చిమ్మిరితొక్కి హారతి పట్టవలెను. సమర్తపాట, మంగళ హారతి పాటలు పాడవలెను. రోలులోని చిమ్మిరి, ముందుగ 3 సార్లు అమ్మాయి చేతిలో పెట్టి మిగిలినది సమర్తకాని పిల్లలకు పెట్టుదురు. బొట్టు, గంధము ముందుగా సమర్త పెండ్లికూతురునకు ఇచ్చి, తరువాత ముత్తైదువులకు ఇచ్చెదరు.
మొదట 3రోజులు పులగము అన్నము (బియ్యములో పెసరపప్పు కలిపి వండవలెను), ఒక మూకుడులో విస్తరాకు లేక వెండి గిన్నె వుంచి సమర్త పెండ్లికూతురునకు, ఆ అన్నము పెట్టెదరు. అన్నములోకి బెల్లము ముక్క లేక పంచదారతో తినవలెను. తరిగినవి తినరాదు. పుల్లలు తుంచుట చేయకూడదు. అరటిపండు ఎవరైనా వలిచి ఇచ్చిన తినవలెను. ఉపనయనము సమయములో వాడిన మూకుడులో అన్నము పెట్టిన ఏదైనా దోషము ఉన్న పోవును. వరుస స్నానము 4, 7, 9, 11 రోజులలో చేయించెదరు. 4వ రోజు భోజనములో అట్లు వడ్డించాలి, పాలరసము చేయాలి. వరస స్నానము 4సార్లు, మాములుగా బంతిలో భోజనము చేయవచ్చును. 4 రోజుల తరువాత కొబ్బరి పొడుము, అప్పడము, వడియముతోనే భోజనము పెట్టవలెను. తినలేనిచో పాలు, మజ్జిగ పలుచగ చేసి అన్నములో పోయవలెను.
పత్యము:
వంకాయ, గోంగూర, తరిగినవి. అరిశె, జున్ను, అట్టు తినకూడదు. చిమ్మిరి ముద్దలు, వేరే ఏ స్వీటు అయినా తినవచ్చును. సమర్త సమయమున చిమ్మిరి ఎంత పంచిన అంత మంచిది. ఏదైనా గుడి ముందు వాళ్ళకు చిమ్మిరి ముద్దలు పంచవచ్చును.
చిమ్మిరి తొక్కుటకు కావలసినవి:
నువ్వులు - ఒకటిన్నర కేజి (100 ముద్దలు వచ్చును)
బెల్లము - ఒకటిన్నర కేజి
ఎండు కొబ్బరి తురుము - అర కేజి
నువ్వులు వేయించి, రోలులో తొక్కి దానికి బెల్లము, ఎండుకొబ్బరి కలిపి బాగా తొక్కి ముద్దలు చేయాలి.
11వ రోజు అమ్మాయికి గాజులు తొడిగించెదరు. ఆ రోజు బంధువులను పిలిచి భోజనములు పెట్టెదరు. అందరికి 2 గాజులు కూడా పంచిపెట్టెదరు. 4సమర్తలు, కన్నెముట్లు 3, అయిన దాక ఊరు పొలిమేర దాటరాదు.
సమర్త స్నానము:
3వ రోజు రాత్రి 3గం||కి స్నానము చేయించవలెను. నువ్వుల నూనె వంటికి రాసి నలుగు పెట్టి తలస్నానము చేయించాలి. అయినాక 5ని|| తరువాత మరల తలస్నానము చేయించవలెను. దీనినే దొంగస్నానము అందురు. 7, 9, 11 రోజులలో ఉదయమే ఇలా నలుగుపెట్టి స్నానము చేయించవలెను. 11వ రోజు పంతులు గారు వచ్చి పుణ్య వచనము చేయించెదరు. 2వ సమర్త 9వ రోజుతో, 3వ సమర్త 7వ రోజుతో, 4వ సమర్త 5వ రోజుతో, మూడుముట్లు కన్నెముట్లు అని 4వ రోజు దూరము గానే వుంచి 5వ రోజు ఇంట్లోకి వచ్చెదరు.