శ్రీ మేధా దక్షిణామూర్తి జ్యోతిష నిలయం

మీరు జన్మించిన తేది, సమయం, ప్రదేశం ఈ మూడు సమాచారములు మాకు తెలియచేసినచో మీ వ్రుత్తి,వ్యాపార,ఆరోగ్య,ఆర్ధిక పరిస్తితులు, దాంపత్యం, విద్య, ఉద్యోగ, వివాహ, కుటుంబవ్యవహారాలు, సంతానం, రాజకీయ వ్యవహారాలు,ప్రేమ వ్యవహారములు,కుజ దోషం, కాలసర్ప దోషం మరియు వివాహ, ఉపనయన, గృహప్రవేస, జప, హోమ, వ్రత, అన్నప్రసన, నామకరణం లకు ముహూర్తములు పెట్టబడును. P.V.RADHAKRISHNA CELL :+91 9966455872, Mail us : parakrijaya@gmail.com

17, నవంబర్ 2025, సోమవారం

కృష్ణ అంగారక చతుర్దశి

18.11.2025. మంగళవారం

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయణం, శరదృతువు

సుప్రభాతం......

ఈరోజు కార్తిక మాస బహుళ పక్ష *త్రయోదశి* తిథి ఉదయం 07.12 వరకూ తదుపరి *చతుర్దశి* తిథి, *స్వాతీ* నక్షత్రం ఈరోజు పూర్తిగా, *ఆయుష్యాన్* యోగం ఉ.07.12 వరకూ తదుపరి *సౌభాగ్య* యోగం, *వణిజ* కరణం ఉ.07.12 వరకూ, *భద్ర(విష్టీ)* కరణం రా.08.27 వరకూ తదుపరి *శకుని* కరణం ఉంటాయి. 

ఈరోజు మాస శివరాత్రి బహుళ పక్ష చతుర్దశి తిథి, త్రయోదశి తిథి కలసి ఉన్న రోజు శివ రాత్రి పండుగ జరుపుకోవడానికి అత్యంత అనుకూలం.

ఈరోజు కృష్ణ అంగారక చతుర్దశి. మంగళ వారం రోజు బహుళ పక్ష చతుర్దశి ఉన్న రోజు ని కృష్ణ అంగారక చతుర్దశి అని పిలుస్తారు. ఈరోజు సూర్య గ్రహణం పట్టిన రోజంత పుణ్య దినం అనీ, పుణ్య నదులలో కానీ సముద్రంలో కానీ స్నానం చేసి, యమ తర్పణం ఇవ్వడం మిక్కిలి ఫల ప్రదం అని పురాణ వచనం.

తిథి శూన్య నక్షత్రం నిన్న తెల్లవారుఝాము 04.47 నుండి ఈరోజు ఉదయం 07.12 వరకూ ఉంటుంది. ఏ మాసం లో అయినా త్రయోదశి తిథి వ్యాప్తి ఉన్నరోజు, చిత్త స్వాతీ నక్షత్రాలు వచ్చినట్లయితే, చిత్త స్వాతీ నక్షత్రాలను తిథి శూన్య నక్షత్రాలు అని పిలుస్తారు. ఈ సమయంలో శుభ కార్యాలు చేయడానికి అనుకూలం కాదు.

24, అక్టోబర్ 2025, శుక్రవారం

నాగులచవితి విశిష్టత

నాగుల చవితి శుభాకాంక్షలు అందరికి, 
Nagula Chavithi Good Wihses to All
నాగులచవితి విశిష్టత 

ఆశ్లేష , ఆరుద్ర , మూల , పూర్వాభాద్ర , పూర్వాషాడ అను ఈ ఐదు నక్షత్రములు సర్ప నక్షత్రములు.* సర్పము అనగా కదిలేది , పాకేది.  *నాగములో *‘న , అగ’* ఎప్పుడూ కదులుతూ ఉండేదని అర్థం. క్షణం కూడా ఆగకుండా అతివేగంగా వెళ్ళేదాన్ని *‘నాగము’* అంటారు. అన్నింటికంటే వేగంగా వెళ్ళేది *‘కాలము’* కావున నాగమునకు మరో అర్థం కాలం. అందుకే ‘కాలనాగము’ లేదా *‘కాలనాగు’* అని అంటారు. 

జ్యోతిష్యశాస్త్రానుసారం కాలసర్ప దోషం ఉన్నవారికి జీవన క్రమంలో ఎన్నో అవరోధాలు ఏర్పడుతాయి.  జీవితం నిరంతరం కొనసాగే ప్రక్రియ అనగా *‘నాగం’*. సర్పము హృదయ భాగంతో పాకుతూ ఉంటుంది. ఈ భాగాన్ని ‘ఉరా’ అంటారు.  కావున సర్పానికి ‘ఉరగము’ అని కూడ పేరు. ఉదరమున ఉన్న మనస్సు చెప్పినట్టు నడిచే వాళ్ళమైన మనమూ కూడా *‘ఉరగముల’* మే. సర్పం తాను నిరంతరం సాగుతూ మన జీవనక్రమంలోని వివాహం , సంతానం వంటి జీవన ఘట్టాలను అవరోధపరస్తుంది కావున కార్తీక మాసంలో నాగులను ఆరాధిస్తారు. అగ్ని దేవతగా ఉండేది. కార్తీకమాసములోనే. మన జీవనానికి కావాల్సిన ఉత్సాహం , ఉత్తేజం వంటివి తేజస్సు వలన అనగా సూర్యుడు , అగ్ని వలన కలుగుతాయి. శ్రీహరికి శయ్య , శంకరునికి ఆభరణము కూడా సర్పమే.  కావున నాగులను ఆరాధించడం వలన హరిహరులను సేవించిన ఫలం దక్కుతుంది.

కార్తికమాసమంతా ఇంట్లో నాగ ప్రతిమను ఆరాధిస్తూ , నాగస్తుతిని చేస్తే పరమాత్మ అనుగ్రహిస్తాడు. కార్తీకమాసం నెలరోజులు కాకపోయినా కనీసం *కార్తీక శుద్ధ చవితినాడు*  నాగులను ఆరాధించాలి. చవితి అంటే నాల్గవది అనగా *ధర్మార్థ కామ మోక్ష పురుషార్థాలలో*  నాల్గవది మోక్షం కావున ఆనాడు నాగులను ఆరాధిస్తే మోక్షము లభిస్తుంది. అంటే జీవితంలో వచ్చిన కష్టాల నుండి విముక్తులవుతాము. కావున నాగులను చవితినాడు దేవాలయాలలో , గృహములో లేదా పుట్టల వద్ద నాగ దేవతను ఆరాధించాలి.* 

ప్రకృతి మానవుని మనుగడకు జీవనాధరమైనది కనుక దానిని దైవ స్వరూపంగా భావించి మన పూర్వీకులు చెట్టును , పుట్టను , రాయిని , రప్పను , కొండను , కోనను , నదిని , పర్వతాన్ని ఇలా సమస్త ప్రాణికోటిని దైవ స్వరూపంగా చూసుకొంటూ ! పూజిస్తూవస్తున్నారు. ఇదే మనభారతీయ సంస్కృతిలోని హిందువుల పండగల విశిష్టత. 

నిశితంగా పరిశీలిస్తే ... అందులో భాగంగానే *"నాగుపాము"* ను కూడా నాగరాజుగా , నాగదేవతగా పూజిస్తూ వస్తున్నారు.

ఈ రోజున ఊరిలో ఉన్న గుళ్ళలో ఉన్న పుట్టలలో కానీ లేదా ఊరి బయట ఉన్న పాము పుట్టలో పాలు పోస్తారు. పుట్టలో పాలు పోయటమనేది భారతదేశంలో అనాదిగా వస్తున్న ఆచారం. సిటీ ప్రాంతంలో నాగుల చవితికి అంత సందడిగా కనిపించదు కానీ గ్రామీణ ప్రాంతాలలో మాత్రం ఎంతో సందడి సందడిగా కనిపిస్తుంది. 

దేవాలయాల్లో రాతి విగ్రహా జంట పాముల ప్రతిమలు , రెండు పాములు మెలికలు వేసుకొని రావి , వేప చెట్ల కింద దర్శనం ఇవ్వటం మనము ఎక్కువ గమనిస్తుంటాము. చవితి నాడు సర్పాలను పూజిస్తే సర్వరోగాలు , వైవాహిక , దాంపత్య దోషాలు , గర్భదోషాలు పోయి ఆరోగ్యవంతులవుతారని భక్తులు విశ్వాసంతో పుజిస్తారు. ఎందుకంటే కుజ దోషం , కాలసర్ప దోషానికి అధిదేవత సుబ్రహ్మణ్య స్వామి కాబట్టి నాగుపాము పుట్టకు పూజ చేస్తే కళత్ర దోషాలు తొలగుతాయని శాస్త్రాలు సూచిస్తున్నాయి. ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా మన దేశంలో ఒక్కో చోట ఒక్కో విధంగా నాగులచవితిని జరుపుకుంటారు. *కొన్ని ప్రాంతాల వారు దీపావళి అమావాస్య తరువాత వచ్చే కార్తీక శుద్ధ చతుర్థిని నాగుల చవితి పండుగ  జరుపుకుంటారు. కొందరు శ్రావణ శుద్ధ చతుర్థినాడు జరుపుకుంటారు.*  ఇవి రైతులకు కూడా ఎంతో మేలును చేకూరుస్తాయిఈ పాములు భూమి అంతర్భాగమందు నివసిస్తూ భూసారాన్ని కాపాడే ప్రాణులుగా సమస్త జీవకోటికి *" నీటిని"* ప్రసాదించే దేవతలుగా తలచేవారు. ఇవి పంటలను నాశనంచేసే  క్రిమికీటకాదులను తింటూ , పరోక్షంగా *" రైతు "* కు పంటనష్టం కలగకుండా చేస్తాయట !.  అలా ప్రకృతి పరంగా అవి మనకు ఎంతో సహాయపడుతూ ఉంటాయి.

భారతీయ సనాతన సంప్రదాయాల్లో జంతు పూజ ఒకటి. ఈశ్వరాంశ ప్రతి ప్రాణిలోనూ వ్యాపించి ఉన్నదని ఉపనిషత్‌ ప్రబోధం. ప్రకృతి పరిరక్షణకు తోడ్పడే సద్భావన అది. వేదంలో నాగ పూజ కనిపించకున్నా -  సంహితల్లో , బ్రాహ్మణాల్లో ఆ ప్రసక్తి వస్తుంది. పురాణ , ఇతిహాసాల్లోని గాథల్లో సర్పాలు వివిధ సందర్భాల్లో ప్రత్యక్షమవుతాయి. ఈ రోజునే తక్షకుడు , కర్కోటకుడు , వాసుకి , శేషుడు మొదలైన 100 మంది నాగ ప్రముఖులు జన్మించారని పురాణ కథనం. భూలోకానికి క్రింద ఉన్న అతల , వితల , సుతల , తలాతల , రసాతల , మహాతల , పాతాళ లోకాలల్లో వివిధ జీవరాసులు నివసిస్తాయి. వాటిలో ఐదు రసాతల లోకాల్లో రాక్షసులు నివసిస్తారు. చివరిదైన పాతాళ లోకంలో నాగులు ఉంటాయి. నాగ ప్రముఖులందరూ అక్కడ ఉంటారు. ఈరోజున నాగులకు ఆహారం అందజేస్తే నాగదోషం సహా మొదలైన దోషాలు తొలగిపోతాయి.

కద్రువ నాగ మాత , మహావిష్ణువుకు శయ్యగా అమరిన ప్రాణి ఆదిశేషువు. సర్పం పరమశివుడి కంఠాన మనోహర ఆభరణం. సూర్యభగవానుడి రథానికి సర్పమే పగ్గం. అదే - ఆకాశం మధ్య వెలసిన కుజగ్రహానికి కుదురు. భైరవుడి భుజంపై వేలాడే యజ్ఞోపవీతం సర్పమే. శనిదేవుడి చేతిలోని  ఆయుధమూ అదే. సర్పమే మంథర పర్వతానికి కవ్వపు తాడుగా మారింది. దేవతలకు , రాక్షసులకు సముద్ర మథన సమయంలో సహాయకారిగా ఉపయోగపడింది.

దంపతులకు సంతానం కలగకపోవడానికి ప్రాచీన , ఆధునిక వైద్యశాస్త్రాలు పలు కారణాలు చెబుతాయి.  సర్పదోషమే కారణమని భావించినవారు రామేశ్వరం వెళ్లి నాగప్రతిష్ఠ చేయడం రివాజు. అక్కడికి వెళ్లలేనివారు తమ గ్రామ దేవాలయప్రాంగణంలోనే సర్ప విగ్రహాల్ని ప్రతిష్ఠించే పద్ధతి ఉంది. మన ప్రాచీన దేవాలయాల చుట్టూ శిథిలమైన నాగ విగ్రహాలు ఇప్పటికీ దర్శనమిస్తుంటాయి.

వర్షకాలంలో పాములు పుట్టల్లో నుంచి బయటకు వచ్చి సంచరిస్తాయి. అందుకే శ్రావణ మాసంలో సైతం *‘నాగ పంచమి’*  పేరుతో పండుగ చేసుకుంటారు. పుట్ట వల్ల భూమిలో తేమ పెరుగుతుంది. పంటలకు ఇది ఎంతో అవసరం. పంటలకు మూలం పాములే కాబట్టి , రైతులు వాటిని దేవతలుగా భావిస్తుంటారు. పంటలు ఏపుగా పెరిగే కాలంలో *‘కార్తీక శుద్ధ చవితి’నాడు* మనం *‘నాగుల చవితి’ని*  పర్వదినంగా ఆచరిస్తున్నాం.

పాములకు ప్రాణదానం చేసిన ఆస్తీకుడి కథ భారతంలో ఉంది. ఇతడు జరత్కారువు అనే నాగజాతి స్త్రీకి జన్మిస్తాడు. జనకుడి పేరు జరత్కారుడు. చిన్నతనంలోనే సకల విద్యలూ నేర్చుకున్న ఆస్తీకుడు గొప్ప జ్ఞాని అవుతాడు !.

పరీక్షిత్తు పాముకాటు వల్ల మరణిస్తాడు. ఇందుకు ఆగ్రహించిన అతడి పుత్రుడు జనమేజయుడు సర్వ సర్ప జాతీ నాశనం కావాలని సర్పయాగం ప్రారంభిస్తాడు. ఎక్కడెక్కడి నుంచో పాములు వచ్చి యాగాగ్నిలో పడి మాడిపోతాయి. మిగిలిన సర్పాలు తమను రక్షించాలని జరత్కారువును ప్రార్థిస్తాయి.  రాజును ఒప్పించి సర్పయాగం ఆపించాలని ఆమె తన కుమారుడు ఆస్తీకుణ్ని కోరుతుంది. అతడు జనమేజయుడి వద్దకు వెళ్తాడు. అతడి  విద్యానైపుణ్యాన్ని చూసిన జనమేజయుడు సత్కరించడానికి సిద్ధపడతాడు.

*‘సర్ప హింస మంచిది కాదు. నీవు ఈ యాగం మాని , వాటిని రక్షిస్తే చాలు. అదే నాకు పెద్ద సత్కారం’* అంటాడు ఆస్తీకుడు. జనమేజయుడు అందుకు అంగీకరించి , సర్పయాగాన్ని విరమిస్తాడు. నాగుల చవితినాడు ఈ కథ వింటే , నాగ దోషాల నుంచి విముక్తి కలుగుతుందని పలువురి నమ్మకం.

పంట పొలాలకు శత్రువులు ఎలుకలు , వాటిని నిర్మూలించేవి పాములు. అవి క్రమంగా కనుమరుగైతే , మానవాళి మనుగడకే ప్రమాదం. నాడు ఆస్తీకుడు వంటి విజ్ఞాని ప్రబోధం వల్ల జనమేజయుడు ప్రభావితుడయ్యాడు. అదే ఉద్బోధతో మన కర్తవ్యాన్ని గుర్తుచేస్తుంది నాగుల చవితి పండుగ ! ఈ నాగుల చవితి నాడు నాగేంద్రుని శివునికి వాసుకిగా , విష్ణువుకు ఆది శేషుడుగా తోడు ఉంటాడు కాబట్టి ఈ చవితి రోజు విశ్వాసం గల భక్తుల పూజ నైవేద్యాలను సమర్పిస్తే సర్వరోగాలు పోయి సౌభాగ్యవంతులవుతారని భారతీయుల నమ్మకం. 

*ఆధ్యాత్మిక యోగా పరంగా :-* ఈ మానవ శరీరమనే పుట్టకు తొమ్మిది రంధ్రాలు ఉంటాయి. వాటినే నవరంధ్రాలు అంటూ ఉంటారు. మానవ శరీరంలో నాడులతో నిండివున్న వెన్నెముకను *' వెన్నుపాము'* అని అంటారు. అందులో కుండలినీశక్తి మూలాధారచక్రంలో *"పాము"* ఆకారమువలెనే వుంటుందని *"యోగశాస్త్రం"* చెబుతోంది. ఇది మానవ శరీరంలో నిద్రిస్తున్నట్లు నటిస్తూ ! కామ , క్రోధ , లోభ , మోహ , మద , మాత్సర్యాలనే విషాల్ని గ్రక్కుతూ  మానవునిలో *'సత్వగుణ'* సంపత్తిని హరించి వేస్తూ ఉంటుందని అందుకు *' నాగుల చవితి రోజున ప్రత్యక్షంగా విషసర్ప పుట్టలను ఆరాధించి పుట్టలో పాలు పోస్తే మానవునిలో ఉన్న విషసర్పం కూడా శ్వేతత్వం పొంది , అందరి హృదయాలలో నివసించే ' శ్రీమహావిష్ణువు"* నకు తెల్లని ఆదిశేషువుగా మారి శేషపాన్పుగా మారాలని కోరికతో చేసేదే ! ఈ నాగుపాము పుట్టలో పాలు పోయుటలోగల అంతర్యమని కొంత మంది పెద్దల మాటల ద్వార తెలుస్తుంది.

నాగులకు పాలు పోయడంలోని అంతరార్థం*

పాలు స్వచ్ఛతకు ప్రతీక. ఈ పాలను వేడి చేసి చల్లపరచి దానికి కొద్దిగా చల్లను చేరిస్తే పెరుగవుతుంది. ఆ పెరుగును చిలుకగా వచ్చిన చల్లలో నుంచి వచ్చే వెన్నను కాయగా నెయ్యి అవుతుంది. దీనిని మనం యజ్ఞంలో హవిస్సుగా ఉపయోగిస్తాం. అలాగే మన బ్రతుకనే పాలను జ్ఞానమనే వేడితో కాచి వివేకమనే చల్ల కలిపితే సుఖమనే పెరుగు తయారవుతుంది. ఈ పెరుగును ఔదార్యమనే కవ్వంతో చిలుకగా శాంతి అనే చల్ల లభిస్తుంది. ఆ చల్లను సత్యం , శివం , సుందరం అనే మూడు వేళ్ళతో కాస్త వంచి తీస్తే సమాజ సహకారం అనే వెన్న బయటకు వస్తుంది.  ఆ వెన్నకు భగవంతుని ఆరాధన అనే జ్ఞానాన్ని జోడిస్తే త్యాగము , యోగము , భోగమనే మూడు రకముల నెయ్యి ఆవిర్భవిస్తుంది. ఇదే సకల వేదాలసారం , సకల జీవనసారం అయిన పాలను జీవనమునకు ప్రతీక అయిన నాగులకు అర్పించడంలోని అంతరార్థం.

*”దేవా: చక్షుషా భుంజానా: భక్తాన్‌ పాలయంతి”* అనేది ప్రమాణ వాక్యం , అనగా దేవతలు ప్రసాదాన్ని చూపులతోనే ఆరగిస్తారని అర్థం. పాములు పాలు తాగవనే అపోహతో పాలు పోయడం మానకుండా కొద్దిగా పాలను పుట్టలో పోసి మిగిలిన పాలను నైవేద్యంగా స్వీకరించాలి.

*నాగుల చవితి మంత్రం*
పాములకు చేసే ఏదైనా పూజ , నైవేద్యం నాగదేవతలకు చేరుతుందని నమ్ముతారు. అందువల్ల ఈ రోజు ప్రజలు పాములను ఆరాధిస్తారు. అనేక సర్పదేవతలు ఉన్నప్పటికీ 12 మందిని మాత్రం నాగులు చవితి పూజా సమయంలో కొలుస్తారు. అంతేకాకుండా పాముకు పాలను సమర్పిస్తుంటారు. చవితి నాడు సర్పాలను పూజిస్తే కుజ దోషం , కాలసర్ప దోషానికి ఆదిదేవుడు సుభ్రహ్మణ్య స్వామి కాబట్టి నాగుపాము పుట్టకు పూజ చేస్తే కళత్ర దోషాలు తొలుగుతాయని శాస్త్రాలు సూచిస్తున్నాయి.
అనంత
వాసుకి
శేష
పద్మ
కంబాల
కర్కోటకం
ఆశ్వతార
ధృతరాష్ట్ర
శంఖపాల
కలియా
తక్షక
పింగళ
ఈ ప్రపంంచంలో పాములు, ఆకాశం , స్వర్గం , సూర్యకిరణాలు , సరస్సులు , బావులు చెరువులు నివసిస్తున్నాయి. ఈ రోజు ఈ సర్పాలను పూజించి ఆశీర్వాదాలు పొందుతారు.

*పాము పుట్టలో  పాలు పోసేటప్పుడు  ఇలా చేప్పాలి మరియు పిల్లలు చేత చెప్పించాలి .*

 *నడుము తొక్కితే నావాడు అనుకో* 
 *పడగ తొక్కితే పగవాడు కాదు అనుకో* 
 *తోక తొక్కితే తోటి వాడు అనుకో* 
 *నా కంట నువ్వుపడకు నీకంట నేను పడకుండా చూడు తండ్రీ అని చెప్పాలి.* 

ప్రకృతిని పూజిచటం  మన భారతీయుల  సంస్కృతి.  మనం విషసర్పమును కూడా పూజించి మన శత్రువును కూడా ఆదరిస్తాము. అని అర్ధము.  పిల్లల చేత ఇవి చెప్పించటం ఎందుకంటే వారికి మంచి అలవాట్లు నేర్పించటము ముఖ్యవుద్దేశము.

మనలను ఇబ్బంది పెట్టినవారిని , కష్టపెట్టేవారిని క్షమించాలి అని తెలుపుట ఇలాంటివి నేర్పుట ఉద్దేశము. నాగుల చవితిరోజు పుట్టలో పాలుపోసిన తరువాత.  బియ్యం , రవ్వ లేదా పిండిని చుట్టూ జల్లుతారు ఎందుకంటే మన చుట్టూ వుండే చిన్న చిన్న జీవులకు ఆహారంను పెట్టటం అన్నమాట.  ఉదాహరణకు చీమలకు ఆహారంగా పెడుతున్నాం.  పుట్ట నుండి మట్టి తీసుకొని ఆ మన్నును చేవులకు పెడతారు.  ఎందుకంటే చెవికి సంభందించిన ఇబ్బందులు రాకూడదని.

కాలనాగము మానవ శరీరంలో నిద్రిస్తున్నట్లు నటిస్తూ ! కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే విషాల్ని గ్రక్కుతూ మానవునిలో 'సత్వగుణ' సంపత్తిని హరించి వేస్తూ ఉంటుందని అందుకు నాగుల చవితి రోజున ప్రత్యక్షంగా విషసర్ప పుట్టలను ఆరాధించి పుట్టలో పాలు పోస్తే మానవునిలో ఉన్న విషసర్పం కూడా శ్వేతత్వం పొంది , అందరి హృదయాలలో నివసించే 'శ్రీమహావిష్ణువు" నకు తెల్లని ఆదిశేషువుగా మారి శేషపాన్పుగా మారాలని కోరికతో చేసేదే ! ఈ నాగుపాము పుట్టలో పాలు పోయుటలో గల అంతర్యమని కొంత మంది పెద్దల మాటల ద్వారా తెలుస్తుంది.

 నవనాగ నామ స్తోత్రం - సర్ప సూక్తం 

అనంతం వాసుకిం శేషం పద్మనాభం చ కంబలం!
శంఖపాలం ధృతరాష్ట్రం తక్షకం కాళియం తథా!!

 ఫలశృతి: 
ఏతాని నవ నామాని నాగానాం చ మహాత్మనామ్!
సాయంకాలే పఠేన్నిత్యం ప్రాతః కాలే విశేషతః!

సంతానం ప్రాప్యతే నూనం సంతానస్య చ రక్షకాః!
సర్వబాధా వినిర్ముక్తః సర్వత్ర విజయీభవేత్!!

సర్ప దర్శనకాలే వా పూజాకాలే చ యః ఫఠేత్!
తస్య విషభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్‌!!

🙏ఓం నాగరాజాయనమః ప్రార్థయామి నమస్కరోమి🙏
ఇతి శ్రీ నవనాగ స్తోత్రం.
🐍🐍🐍🐍🐍


 సర్ప సూక్తం

బ్రహ్మలోకేషు యేసర్పాః శేషనాగ పురోగమాః
నమోస్తు తేభ్యః సర్వేభ్యః సుప్రీతాః మమ సర్వదాః

ఇంద్రలోకేషు యేసర్పాః వాసుకీ ప్రముఖాదయః
నమోస్తు తేభ్యః సర్వేభ్యః సుప్రీతాః మమ సర్వదాః

కౌద్ర వేయాశ్చ యేసర్పాః మాతృభక్తి పరాయణాః
నమోస్తు తేభ్యః సర్వేభ్యః సుప్రీతాః మమ సర్వదాః

ఇంద్రలోకేషు యేసర్పాః తక్షకా ప్రముఖాదయః
నమోస్తు తేభ్యః సర్వేభ్యః సుప్రీతాః మమ సర్వదాః

సత్యలోకేషు యేసర్పాః వాసుకి నా సురక్షితాః
నమోస్తు తేభ్యః సర్వేభ్యః సుప్రీతాః మమ సర్వదాః

మలయేచైవ యేసర్పాః కర్కోటక ప్రముఖాదయః
నమోస్తు తేభ్యః సర్వేభ్యః సుప్రీతాః మమ సర్వదాః

పృథివ్యాం చైవ యేసర్పాః యే సాకేత నివాసినః
నమోస్తు తేభ్యః సర్వేభ్యః సుప్రీతాః మమ సర్వదాః

గ్రామే యదివారణ్యే యేసర్పాః ప్రచరన్తిచ
నమోస్తు తేభ్యః సర్వేభ్యః సుప్రీతాః మమ సర్వదాః

సముద్ర తీరే యేసర్పాః యే సర్పా జలవాసినః
నమోస్తు తేభ్యః సర్వేభ్యః సుప్రీతాః మమ సర్వదాః

రసాతలేఘ యేసర్పాః అనంతాది మహాబలాః
నమోస్తు తేభ్యః సర్వేభ్యః సుప్రీతాః మమ సర్వదాః
🌹 🌹 🌹 🌹 🌹





అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు

21, అక్టోబర్ 2025, మంగళవారం

కార్తీక మాస నియమాలు

🏮🪔🏮🪔🏮🪔🏮🪔🏮

కార్తీకమాసంలో ఏ తిథి రోజున ఏం చేయాలి?
విధానాలు తెలుసుకుందా..!!

దీపావళి మరుసటిరోజు నుంచి మొదలయ్యే కార్తీక మాసం అన్ని మాసాల్లో కెల్లా విశిష్టమైనదని మొట్టమొదట వశిష్ట మహర్షి జనక మహారాజుకు చెప్పాడని పురాణోక్తి.

న కార్తీక సమో మాసోన శాస్త్రం నిగమాత్పరమ్ |
నారోగ్య సమముత్సాహం న దేవః కేశవాత్పరః||

అంటే కార్తీక మాసంలోని ప్రతీ రోజు పుణ్యప్రదమే. ఒక్కో రోజుకు ఒక్కో రకమైన విశిష్టత ఉంది. 

ఈ మాసంలో ఏ తిథిలో ఏమి చేయాలో తెలుసుకుందాం 

*కార్తీక శుద్ధ పాడ్యమి :*
తెల్లవారుజామునే లేచి, స్నానం చేసి, గుడికి వెళ్లాలి. కార్తీక వ్రతాన్ని నిర్విఘ్నంగా చేసేట్టుగా అనుగ్రహించమని ప్రార్థించి, సంకల్పం చెప్పుకొని, ఆకాశదీపాన్ని సందర్శించుకోవాలి.

*విదియ :*
సోదరి ఇంట ఆమె చేతి భోజనం చేసి, కానుకలు ఇచ్చి రావాలి. ఇలాంటివారికి యమగండం తప్పుతుందంటారు.

*తదియ :*
అమ్మవారికి కుంకుమ పూజ చేయాలి.

*చవితి :*
నాగుల చవితి సందర్భంగా సుబ్రహ్మణ్యేశ్వరుని పూజించాలి. పుట్టలో పాలు పోయాలి.

*పంచమి :*
దీన్ని జ్ఞాన పంచమి అంటారు. ఈ రోజున సుబ్రహ్మణ్యేశ్వరుని పూజిస్తే జ్ఞానవృద్ధి కలుగుతుంది.

*షష్ఠి :*
ఈరోజున బ్రహ్మచారికి ఎర్ర గడుల కండువాను దానం చేస్తే సంతానప్రాప్తి కలుగుతుంది.

*సప్తమి :*
ఎర్రని వస్త్రంలో గోధుమలు పోసి దానం ఇస్తే ఆయుఃవృద్ధి ప్రాప్తిస్తుంది.

*అష్టమి :*
ఈరోజున చేసే గోపూజ మంచి ఫలితాలను ఇస్తుంది. దీన్ని గోపాష్టమి అని కూడా అంటారు.

*నవమి :*
నేటి నుంచి మూడు రోజుల పాటు విష్ణు త్రిరాత్ర వ్రతాన్ని ఆచరించాలి.

*దశమి :*
నేడు రాత్రిపూట విష్ణుపూజ చేయాలి.

*ఏకాదశి :*
దీన్నే బోధనైకాదశి అంటారు. ఈరోజున విష్ణుపూజ చేస్తే సద్గతులు కలుగుతాయి.

*ద్వాదశి :*
ఈరోజు క్షీరాబ్ధి ద్వాదశి అంటారు. సాయంకాలం ఉసిరి, తులసి మొక్కల వద్ద విష్ణుపూజ చేసి, దీపాలను వెలిగించాలి. దీంతో సర్వపాపహరణం అవుతుంది.

*త్రయోదశి :*
సాలగ్రామ దానం చేస్తే కష్టాలు దూరమవుతాయి.

*చతుర్దశి :*
పాషాణ చతుర్దశి వ్రతం చేసుకుంటే మంచిది.

*కార్తీక పూర్ణిమ :*
కార్తీక మాసంలోకెల్లా అతి పవిత్రమైన రోజు. ఈరోజున నదీస్నానం చేసి, శివాలయం వద్ద జ్వాలాతోరణ దర్శనం చేసుకోవాలి. ఈరోజున సత్యనారాయణ వ్రతం చేస్తే సర్వపాపాలూ తొలగిపోతాయి.

*కార్తీక బహుళ పాడ్యమి :*
ఆకుకూర దానం చేస్తే మంచిది.

*విదియ :*
వనభోజనాలు చేయడానికి అనువైన రోజు.

*తదియ :*
పండితులు, గురువులకు తులసిమాలను సమర్పిస్తే తెలివితేటలు పెరుగుతాయి.

*చవితి :*
రోజంతా ఉపవాసం చేసి, సాయంకాలం గరికతో గణపతిని పూజించాలి. ఆ గరికను దిండు కింద పెట్టుకుని పడుకుంటే పీడకలలు పోతాయి.

*పంచమి :*
చీమలకు నూకలు చల్లడం, శునకాలకు అన్నం పెట్టడం మంచిది.

*షష్ఠి :*
గ్రామదేవతలకు పూజ చేయాలి.

*సప్తమి :*
జిల్లేడు పూల దండను శివునికి సమర్పించాలి.

*అష్టమి :*
కాలభైరవాష్టకం చదివి, గారెల దండను భైరవుడికి (శునకం) సమర్పిస్తే ధనప్రాప్తి కలుగుతుంది.

*నవమి :*
వెండి లేదా రాగి కలశంలో నీరు పోసి, పండితునికి దానమిస్తే పితృదేవతలు సంతోషిస్తారు.

*దశమి :*
అన్నదానం చేస్తే విష్ణువు సంతోషించి, కోరికలు తీరుతాయి.

*ఏకాదశి :*
విష్ణు ఆలయంలో దీపారాధన, పురాణ శ్రవణం, పఠనం, జాగరణ చేస్తే మంచి ఫలితాలుంటాయి.

*ద్వాదశి :*
అన్నదానం లేదా స్వయంపాకం సమర్పిస్తే శుభం.

*త్రయోదశి :*
ఈరోజున నవగ్రహారాధన చేస్తే గ్రహదోషాలు తొలగిపోతాయి.

*చతుర్దశి :*
ఈరోజున మాస శివరాత్రి. కాబట్టి శివారాధన, అభిషేకం చేస్తే అపమృత్యు దోషాలు, గ్రహబాధలు తొలగుతాయి.

*అమావాస్య :*
పితృదేవతల పేరుతో అన్నదానం చేస్తే పెద్దలకు నరక బాధలు తొలగుతాయి..

కార్తీక మాసము ముప్పది రోజులు పాటించవలసిన నియమాలు

*🌺మొదటి రోజు :*

*నిషిద్ధములు* :- 
ఉల్లి, ఉసిరి, చద్ది. ఎంగిలి. చల్లని వస్తువులు
*దానములు* :- 
నెయ్యి, బంగారం
*పూజించాల్సిన దైవము* :- 
స్వథా అగ్ని
*జపించాల్సిన మంత్రము* :- 
ఓం జాతవేదసే స్వథాపతే స్వాహా
*ఫలితము* :- 
తేజోవర్ధనము

*🌺2 వరోజు* :

*నిషిద్ధములు* :- 
తరగబడిన వస్తువులు
*దానములు* :- 
కలువపూలు, నూనె, ఉప్పు
*పూజించాల్సిన దైవము* :- 
బ్రహ్మ
*జపించాల్సిన మంత్రము* :- 
ఓం గీష్పతయే - విరించియే స్వాహా
*ఫలితము* :- 
మనః స్థిమితము

*🌺3 వ రోజు* :

*నిషిద్ధములు* :- 
ఉప్పు కలిసినవి, ఉసిరి
*దానములు* :- 
ఉప్పు
*పూజించాల్సిన దైవము* :- 
పార్వతి
*జపించాల్సిన మంత్రము* :- 
ఓం పార్వత్యై - పరమేశ్వర్యై స్వాహా
*ఫలితము* :- 
శక్తి, సౌభాగ్యము

*🌺4 వ రోజు :*

*నిషిద్ధములు* :- 
వంకాయ, ఉసిరి
*దానములు* :- 
నూనె, పెసరపప్పు
*పూజించాల్సిన దైవము* :- 
విఘ్నేశ్వరుడు
*జపించాల్సిన మంత్రము* :- 
ఓం గం గణపతయే స్వాహా
*ఫలితము* :- 
సద్బుద్ధి, కార్యసిద్ధి

*🌺5 వ రోజు :*

*నిషిద్ధములు* :- 
పులుపుతో కూడినవి
*దానములు* :- 
స్వయంపాకం, విసనకర్ర
*పూజించాల్సిన దైవము* :- 
ఆదిశేషుడు
*జపించాల్సిన మంత్రము* :- 
(మంత్రం అలభ్యం, ప్రాణాయామం చేయాలి)
*ఫలితము* :- 
కీర్తి

*🌺6 వ రోజు :*

*నిషిద్ధములు* :- 
ఇష్టమైనవి, ఉసిరి
*దానములు* :- 
చిమ్మిలి
*పూజించాల్సిన దైవము :-* 
సుబ్రహ్మణ్యేశ్వరుడు
*జపించాల్సిన మంత్రము* :- 
ఓం సుం.బ్రం. సుబ్రహ్మణ్యాయ స్వాహా
*ఫలితము* :- 
సర్వసిద్ధి, సత్సంతానం, జ్ఞానలబ్ధి

*🌺7 వ రోజు :*

*నిషిద్ధములు* :- 
పంటితో తినే వస్తువులు, ఉసిరి
*దానములు* :- 
పట్టుబట్టలు, గోధుమలు, బంగారం
*పూజించాల్సిన దైవము* :- 
సూర్యుడు
*జపించాల్సిన మంత్రము* :- 
ఓం. భాం. భానవే స్వాహా
*ఫలితము* :- 
తేజస్సు, ఆరోగ్యం

*🌺8 వ రోజు :*

*నిషిద్ధములు* :- 
ఉల్లి, ఉసిరి, మద్యం, మాంసం
*దానములు* :- 
తోచినవి - యథాశక్తి
*పూజించాల్సిన దైవము* :- 
దుర్గ
*జపించాల్సిన మంత్రము* :- 
ఓం - చాముండాయై విచ్చే - స్వాహా
*ఫలితము* :- 
ధైర్యం, విజయం

*🌺9 వ రోజు :*

*నిషిద్ధములు* :- 
నూనెతో కూడిన వస్తువులు, ఉసిరి
*దానములు* :- 
మీకు ఇష్టమైనవి పితృ తర్పణలు
*పూజించాల్సిన దైవము :-* 
అష్టవసువులు - పితృ దేవతలు
*జపించాల్సిన మంత్రము* :- 
ఓం అమృతాయ స్వాహా - పితృదేవతాభ్యో నమః
*ఫలితము* :- 
ఆత్మరక్షణ, సంతాన రక్షణ

*🌺10 వ రోజు :*

*నిషిద్ధములు* :- 
గుమ్మడికాయ, నూనె, ఉసిరి
*దానములు* :- 
గుమ్మడికాయ, స్వయంపాకం, నూనె
*పూజించాల్సిన దైవము* :- 
దిగ్గజాలు
*జపించాల్సిన మంత్రము* :- 
ఓం మహామదేభాయ స్వాహా
*ఫలితము* :- 
యశస్సు - ధనలబ్ధి

*🌺11 వ రోజు :*

*నిషిద్ధములు* :- 
పులుపు, ఉసిరి
*దానములు* :- 
వీభూదిపండ్లు, దక్షిణ
*పూజించాల్సిన దైవము* :- 
శివుడు
*జపించాల్సిన మంత్రము* :- 
ఓం రుద్రాయస్వాహా, ఓం నమశ్శివాయ
*ఫలితము* :- 
ధనప్రాప్తి, పదవీలబ్ధి

*🌺12 వ రోజు :*

*నిషిద్ధములు* :- 
ఉప్పు, పులుపు, కారం, ఉసిరి
*దానములు* :- 
పరిమళద్రవ్యాలు, స్వయంపాకం, రాగి, దక్షిణ
*పూజించాల్సిన దైవము*:- 
భూదేవీసహిత శ్రీమహావిష్ణు లేక కార్తీక దామోదరుడు
*జపించాల్సిన మంత్రము* :- 
ఓం భూర్భువర్విష్ణవే వరాహాయ కార్తీక దామోదరాయ స్వాహా
*ఫలితము* :- 
బంధవిముక్తి, జ్ఞానం, ధన ధాన్యాలు

*🌺13 వ రోజు* :

*నిషిద్ధములు* :- 
రాత్రి భోజనం, ఉసిరి
*దానములు* :- 
మల్లె, జాజి వగైరా పూవులు, వనభోజనం
*పూజించాల్సిన దైవము :-* 
మన్మధుడు
*జపించాల్సిన మంత్రము* :- 
ఓం శ్రీ విరిశరాయ నమః స్వాహా
*ఫలితము* :- 
వీర్యవృద్ధి, సౌందర్యం.

*🌺14 వ రోజు :*

*నిషిద్ధములు* :- 
ఇష్టమైన వస్తువులు, ఉసిరి
*దానములు* :- 
నువ్వులు, ఇనుము, దున్నపోతు లేదా గేదె
*పూజించాల్సిన దైవము* :- 
యముడు
*జపించాల్సిన మంత్రము*:- 
ఓం తిలప్రియాయ సర్వ సంహార హేతినే స్వాహా
*ఫలితము* :- 
అకాలమృత్యువులు తొలగుట

*🌺15వ రోజు :*

*నిషిద్ధములు* :- 
తరగబడిన వస్తువులు
*దానములు* :- 
కలువపూలు, నూనె, ఉప్పు
*పూజించాల్సిన దైవము* :- 
కార్తీక దామోదరుడు.
*జపించాల్సిన మంత్రము* :-
'ఓం శ్రీ తులసీథాత్రీ సమేత కార్తీక దామోదరాయ నమః'

*🌺16 వ రోజు :*

*నిషిద్ధములు* :- 
ఉల్లి, ఉసిరి, చద్ది ,ఎంగిలి, చల్ల
*దానములు* :- 
నెయ్యి, సమిధలు, దక్షిణ, బంగారం
*పూజించాల్సిన దైవము* :- 
స్వాహా అగ్ని
*జపించాల్సిన మంత్రము*:- 
ఓం స్వాహాపతయే జాతవేదసే నమః
*ఫలితము* :- 
వర్చస్సు, తేజస్సు , పవిత్రత.

*🌺17 వ రోజు :*

*నిషిద్ధములు*:- 
ఉల్లి, ఉసిరి, చద్ది, ఎంగిలి, చల్ల మరియు తరిగిన వస్తువులు
*దానములు* :- 
ఔషధాలు, ధనం
*పూజించాల్సిన దైవము* :- 
అశ్వినీ దేవతలు
*జపించాల్సిన మంత్రము* :- 
ఓం అశ్విన్యౌవైద్యౌ తేనమః స్వాహా
*ఫలితము* :- 
సర్వవ్యాధీనివారణం ఆరోగ్యం

*🌺18 వ రోజు :*

*నిషిద్ధములు* :- 
ఉసిరి
*దానములు* :- 
పులిహార, అట్లు, బెల్లం
*పూజించాల్సిన దైవము* :- 
గౌరి
*జపించాల్సిన మంత్రము* :- 
ఓం గౌర్త్యె స్వాహా
*ఫలితము* :- 
అఖండ సౌభాగ్య ప్రాప్తి

*🌺19 వ రోజు :*

*నిషిద్ధములు* :- 
నెయ్యి, నూనె, మద్యం, మాంసం, మైధునం, ఉసిరి
*దానములు* :- 
నువ్వులు, కుడుములు
*పూజించాల్సిన దైవము*:- 
వినాయకుడు
*జపించాల్సిన మంత్రము* :- 
ఓం గం గణపతయే స్వాహా
*ఫలితము* :- 
విజయం, సర్వవిఘ్న నాశనం

*🌺20 వ రోజు :*

*నిషిద్ధములు* :- 
పాలుతప్ప - తక్కినవి
*దానములు* :- 
గో, భూ, సువర్ణ దానాలు
*పూజించాల్సిన దైవము* :- 
నాగేంద్రుడు
*జపించాల్సిన మంత్రము* :- 
ఓం సర్పాయ మహాసర్పాయ దివ్యసర్వాయపాతుమాం
*ఫలితము* :- 
గర్భదోష పరిహరణం, సంతానసిద్ధి

*🌺21 వ రోజు :*

*నిషిద్ధములు* :- 
ఉల్లి, ఉసిరి, ఉప్పు, పులుపు, కారం
*దానములు* :- 
యథాశక్తి సమస్త దానాలూ
*పూజించాల్సిన దైవము* :- 
కుమారస్వామి
*జపించాల్సిన మంత్రము* :- 
ఓం సాం శరవణ భవాయ కుమారాయ స్వాహా
*ఫలితము* :- 
సత్సంతానసిద్ధి, జ్ఞానం, దిగ్విజయం

*🌺22 వ రోజు :*

*నిషిద్ధములు* :- 
పంటికి పనిచెప్పే పదార్ధాలు, ఉసిరి
*దానములు* :- 
బంగారం, గోధుమలు, పట్టుబట్టలు
*పూజించాల్సిన దైవము* :- 
సూర్యుడు
*జపించాల్సిన మంత్రము* :- 
ఓం సూం - సౌరయే స్వాహా, ఓం భాం - భాస్కరాయ స్వాహా
*ఫలితము* :- 
ఆయురారోగ్య తేజో బుద్ధులు

*🌺23 వ రోజు :*

*నిషిద్ధములు* :- 
ఉసిరి, తులసి
*దానములు* :- 
మంగళ ద్రవ్యాలు
*పూజించాల్సిన దైవము* :- 
అష్టమాతృకలు
*జపించాల్సిన మంత్రము* :- 
ఓం శ్రీమాత్రే నమః , అష్టమాతృ కాయ స్వాహా
*ఫలితము* :- 
మాతృరక్షణం, వశీకరణం

*🌺24 వ రోజు :*

*నిషిద్ధములు* :- 
మద్యమాంస మైధునాలు, ఉసిరి
*దానములు*:- 
ఎర్రచీర, ఎర్ర రవికెలగుడ్డ, ఎర్రగాజులు, ఎర్రపువ్వులు
*పూజించాల్సిన దైవము* :- 
శ్రీ దుర్గ
*జపించాల్సిన మంత్రము* :- 
ఓం అరిషడ్వర్గవినాశిన్యై నమః శ్రీ దుర్గాయై స్వాహా
*ఫలితము* :- 
శక్తిసామర్ధ్యాలు, ధైర్యం, కార్య విజయం

*🌺25 వ రోజు :*

*నిషిద్ధములు* :- 
పులుపు, చారు - వగయిరా ద్రవపదార్ధాలు
*దానములు* :- 
యథాశక్తి
*పూజించాల్సిన దైవము* :- 
దిక్వాలకులు
*జపించాల్సిన మంత్రము* :- 
ఓం ఈశావాస్యాయ స్వాహా
*ఫలితము* :- 
అఖండకీర్తి, పదవీప్రాప్తి

*🌺26 వ రోజు :*

*నిషిద్ధములు* :- 
సమస్త పదార్ధాలు
*దానములు* :- 
నిలవవుండే సరుకులు
*పూజించాల్సిన దైవము :-* 
కుబేరుడు
*జపించాల్సిన మంత్రము :-* 
ఓం కుబేరాయవై శ్రవణాయ మహారాజాయ స్వాహా
*ఫలితము* :- 
ధనలబ్ది, లాటరీవిజయం, సిరిసంపదలభివృద్ధి

*🌺27 వ రోజు* :

*నిషిద్ధములు* :- 
ఉల్లి, ఉసిరి, వంకాయ
*దానములు* :- 
ఉసిరి, వెండి, బంగారం, ధనం, దీపాలు
*పూజించాల్సిన దైవము* :- 
కార్తీక దామోదరుడు
*జపించాల్సిన మంత్రము* :- 
ఓం శ్రీభూతులసీ ధాత్రీసమేత కార్తీక దామోదరాయ స్వాహా
*ఫలితము* :- 
మహాయోగం, రాజభోగం, మోక్షసిద్ధి

*🌺28 వ రోజు* :

*నిషిద్ధములు* :- 
ఉల్లి, ఉసిరి, సొర, గుమ్మడి ,వంకాయ
*దానములు* :- 
నువ్వులు, ఉసిరి
*పూజించాల్సిన దైవము* :- 
ధర్ముడు
*జపించాల్సిన మంత్రము* :- 
ఓం ధర్మాయ, కర్మనాశాయ స్వాహా
*ఫలితము* :- 
దీర్ఘకాల వ్యాధీహరణం

*🌺29 వ రోజు* :

*నిషిద్ధములు* :- 
పగటి ఆహారం, ఉసిరి
*దానములు* :- 
శివలింగం, వీభూది పండు, దక్షిణ, బంగారం
*పూజించాల్సిన దైవము* :- 
శివుడు (మృత్యుంజయుడు)
*జపించాల్సిన మంత్రము* :- 
ఓంత్రియంబకం యజామహే సుగంధం పుష్టివర్ధనం, 
ఉర్వారుకమివ బంధనాన్తృత్యో ర్ముక్షీయ మామృతాత్
*ఫలితము :-* 
అకాలమృత్యుహరణం, ఆయుర్వృద్ధి, ఆరోగ్యం, ఐశ్వర్యం

*🌺30 వ రోజు :*

*నిషిద్ధములు* :- 
పగటి ఆహారం, ఉసిరి
*దానములు* :- 
నువ్వులు, తర్పణలు, ఉసిరి
*పూజించాల్సిన దైవము* :- 
సర్వదేవతలు + పితృ దేవతలు
*జపించాల్సిన మంత్రము* :- 
ఓం అమృతాయ స్వాహా మమసమస్త పితృదేవతాభ్యో నమః
*ఫలితము* :- 
ఆత్మస్థయిర్యం, కుటుంబక్షేమం

స్వస్తి..
🌺🌺🌺🌺🌺🌺🌺🌺
🏮🪔🏮🪔🏮🪔🏮🪔🏮

6, మే 2025, మంగళవారం

మే నెలలో గ్రహాల మార్పుతో వ్యక్తిగత జాతకాలపై ప్రభావం


         మే నెలలో గ్రహాల మార్పు విశేషంగా ఉంటుంది. మే 6న బుధుడు మీనం నుండి మేష రాశికి మార్పు చెందుతాడు, ఇది మానసిక స్పష్టతను పెంచే అవకాశం ఉంది.

 మే 14న, రవి మేష నుండి వృషభం రాశికి ప్రవేశిస్తాడు, అదే రోజున గురుడు కూడా వృషభం నుండి మిథున రాశికి మారుతాడు, ఇది ఆర్థిక విషయాలపై ప్రభావం చూపించవచ్చు. 

మే 18న, రాహు మీన నుండి కుంభ రాశికి మారుతాడు, అలాగే కేతు కన్య నుండి సింహ రాశికి చేరుకుంటాడు, దీని ప్రభావం వృత్తిపరమైన మరియు ఆధ్యాత్మిక విషయాల్లో ప్రత్యేకంగా కనిపించవచ్చు. 

మే 31న, శుక్రుడు మీనం నుండి మేష రాశికి మార్పు చెందుతాడు, ఇది సంబంధాలలో మరియు సౌందర్యంతో కూడిన అంశాల్లో మార్పును తెచ్చే అవకాశం ఉంది.

 ఈ గ్రహాల మార్పు వ్యక్తిగత, వృత్తిపరమైన, ఆర్థిక మరియు ఆధ్యాత్మిక అంశాలను ప్రభావితం చేయనుంది.


Follow the TeluguAstrology channel on WhatsApp: https://whatsapp.com/channel/0029Va9d4z5EquiIi18jEp12

ఈ బ్లాగును సెర్చ్ చేయండి



Related Posts Plugin for WordPress, Blogger...