శని లక్షణాలు : శని నపుంసక గ్రహం. ఇతను రుచులలో వగరును, రంగులలో నలుపును, నీలమును సూచించును. ఇతను శూద్ర జాతికి చెందినవాడు. అదిదేవత యముడు. ముసలివారిని సూచించును. సన్నని, పొడుగైన వారిని సూచించును. ఇతను వాత తత్త్వమును సూచించును. వాయు తత్త్వము కలిగి పడమర దిక్కును సూచించును. శని శిశిర ఋతువును సూచించును. లోహములలో ఇనుము, ఉక్కును, రత్నములలో నీలమును సూచించును. ఈ గ్రహసంఖ్య 8. సప్తమ భావంలో దిగ్బలము పొందును. ఇతను తమోగుణ ప్రదానుడు. గంగానది నుండి హిమాలయముల వరకు ఇతనిదేశంగా జాతక పారిజాతము సూచించును.
శని పుష్యమి, అనూరాద, ఉత్తరాభాద్ర నక్షత్రములకు అధిపతి. శరీరావయవములలో ఎముకలు, క్లోమము, విసర్జనావయవములను సూచించును. శని మకరం, కుంభం రాశులకు అధిపతి. ఇతనికి ఉచ్ఛరాశి తుల. నీచరాశి మేషం. తులలో 20వ డిగ్రీ ఇతనికి పరమోచ్ఛ. మేషం లో 20 వ డిగ్రీలో పరమనీచ. ఇతనికి బుధ, శుక్రులు స్నేహితులు, రవి, చంద్ర, కుజులు శత్రువులు. గురుడు సముడు.
శని ప్రభావం : సన్నగా, పొడవుగా ఉంటారు. కన్నులు గుంటలు పడి వుండవచ్చు. అనుమానం ఎక్కువ. ఒంటరితనాన్ని కోరుకుంటారు. ఆకలి తక్కువగా ఉంటుంది. మూఢాచారపరులు కష్టజీవులు. దీర్ఘకోపము, దీర్ఘాలోచన ఎక్కువ. నడక, ఆలోచన మందంగా వుంటాయి.
వాతము, అజీర్ణము, శ్వాసకోశవ్యాధులు ఉండవచ్చును.
కార్మికశాఖ, ఆరోగ్యశాఖ, పరిసోధనాశాఖ, మారిటోరియంలలో రాణిస్తారు.
శని కారకత్వములు : శని ఆయుః కారకుడు. ఆటంకములు, వ్యాధులు, కష్టములు, విరోధము, బాధలు, దుఃఖము, నౌకరీ, దురాచారము, మూర్ఖత్వము, బంధనము, జూదము, కారాగారము, మద్యపానము, అమ్గవైకల్యము, మూర్చరోగము, బ్లాక్ మార్కెట్, అన్యాయంతో ధనార్జన, జీవహింస, అవమానము, రాజదండన, బద్దకము, క్షుద్రశక్తులు, అప్పులు, మృత్యుదేవతారాధన, బంధువులచే తిరస్కారములను సూచించును. అందవిహీనులు, చండాలురు, నపుంసకులు, అక్రమసంతానము, సేవకులు, నీచులు, వంటవారు, పురాతన భవనములు, పురాతన వస్తువులు, పురాతన వస్తుశాఖ, సొరంగాలు, గుహలు, చలిప్రదేశములు, నువ్వుల నూనె, గానుగ, నూనె దుకాణములను సూచించును. నువ్వులు, ఉల్లి, వేరుశనగ, బంగాళాదుంపలు, రాగులు, జొన్నలు, మినుములు, దున్నపోతు, గాడిద, ఒంటె, కోడి, బొగ్గు, తారు, నల్లమందు, కిరోసిన్, ఎముకలు, వెంట్రుకలు, దంతములను సూచించును. కలప, తోలు పరిశ్రమలను సూచించును.
ఆలస్యము, పొదుపు, దుఃఖము, ఆటంకములు, దురదృష్టము, సరిహద్దులు, దహనకార్యక్రమములు, అపవాదు, పదవీవిరమణ, నిర్మాణము, శాస్త్రీయ దృక్పదం కలవారు, ఒంటరితనం, పురాతత్వశాస్త్రం, గనులు, బ్రిడ్జి, ధ్వని, చర్మము, ఆనకట్టలు, పిరికివారు, ఎముకలు రాళ్ళు, రాగి, మంచు, ఆస్తి, ఆపద, అనుమానము, అననుకూలత, ఆందోళన, సిరామిక్స్, వినయము, మట్టిని సూచించును.
శని సూచించు విద్యలు : శని ఖనిజములు, బొగ్గుగనులు, పురాతన వస్తుసేకరణ, గనులు, భూగర్భ శాస్త్రము, జ్యోతిష్యము, ఇంగ్లీషుభాష, ఫ్రిజ్ ల తయారీ, ఆర్థోపెడిక్స్ లను సూచించును.
శని సూచించు వ్యాధులు : వాత సంబంధమైన జబ్బులను శని కలిగిస్తాడు. కీళ్ళవాతం, పక్షవాతం, అవయవాలు బలహీనపడి పనిచేయకపోవటం, నొప్పులను సూచించును. కిడ్ని, లివరు ఇతర ప్రాంతాలలో రాళ్ళు ఏర్పడుట, బ్రోంకైటీస్, క్షయ, దగ్గు, ఆస్తమా, న్యుమోనియా వంటి ఊపిరితిత్తులకు సంబంధించిన వాధులను సూచించును. ఎముకలు ఇరిగిపోవుట, ఎముకల జాయింట్లు అరిగిపోవుట, ఎముకల కాన్సర్ వంటి ఎముకలకు సంబంధించిన వ్యాధులను, వెంట్రుకలు తెల్లబడడం, రాలిపోవడం, గోళ్ళు పుచ్చిపోవటం లను శని సూచించును. అజీర్ణము, అంధత్వం, కోమా, నడవలేనిస్థితి, ఏ పనిని చేయలేని స్థితి, డ్రగ్స్ కు బానిసకావటం, ఫ్రిజిడిటీ, నపుంసకత్వములను సూచించును. చంద్రునితో కలసి కంటిలో కాటరాక్ట్ (శుక్లాలు) ను, మతిభరమణం, గర్భాశయ వ్యాధులు, ప్రసవం సక్రామంగా జరగకపోవడం, పిచ్చి, మూర్ఛ, సన్నిపాత జ్వరం, గుండె నొప్పి, తలనొప్పి, కండరాల నొప్పి, అతిదాహం, నీరసం, బద్దకం, శరీరావయవములు మొద్దుబారటం లేదా చచ్చుబడటం వంటివాటిని సూచించును. గురునితో కలసి జీర్ణక్రియ సరిగా లేకపోవుట, కాలేయ వ్యాధులను, రవితో కలసి రక్తం చెడిపోవుట, కుడికంటికి సంబంధించిన వ్యాధులను, బుధునితో కలసి నత్తి, మాటలు రాకపోవటం, నాలుకమొద్దుబారటం, మెదడు మొద్దుబారటం, చెవికి సంబంధించిన రోగాలు, చెవుడు, కుజునితో కలసి కండరాల నొప్పి, కండరాలా జబ్బులను, శుక్రునితో కలసి గొంతునొప్పి, టాన్సిల్స్ వాయుట, అమీబియాస్, విరోచనాలు, పైల్సు పిస్టులా మొదలగు రోగాలను, రాహువుతో కలసి విషప్రయోగం, వైరస్ వలన కలిగే వ్యాధులు, కేతువుతో కలసి అధికరక్తపోటును సూచించును.
శని రోగకారకుడు, మరణ కారకుడు. శని ఏ జబ్బునైనా త్వరగా తగ్గనీయదు.
శని సూచించు వృత్తి వ్యాపారాలు : జైలర్, పోలీస్, వాచ్ మన్, ప్లంబర్, పాకీ పని చేయు వారు, విధులను ఊడ్చేవారు, కూలీలు, మేస్త్రీ, తాపీమేస్త్రీ, తోటమాలి, రైతులను సూచించును.
లోహాలు, తోలు, కలప లకు సంబంధించిన డీలరులను సూచించును. చంద్రునితో కలసి సివిల్ ఇంజనీర్లు, బిల్డర్స్, సర్వేయర్లు, ఎక్సరే టెక్నీషియన్ లను సూచించును. అవితో కలసి ప్రభుత్వ సంస్థలలో స్థానిక సంస్థలలో పనిచేయు వారిని ,గురునితో కలసి రియల్ ఎస్టేట్ వ్యాపారస్థులు, గనుల యజమానులు, సైంటిఫిక్ ఏబొరేటరీలలో పనిచేయువారు, బ్యాంకు సిబ్బంది, ప్రచారం చేయువారిని, బుదునితో కలసి నవలారచయితలు, కలపను కోయువారు, శాస్త్రవేత్తలు, ఉపాధ్యాయులు, సెన్సార్ చేయువారు, రహస్య పరిశోధక సంస్థలలో పనిచేయువారలను సూచించును.
శనికి మిత్రులు: బుధ శుక్ర రాహు కేతు
శనికి శత్రువు: సూర్య చంద్ర మంగళ
శనికి సములు: గురు