శ్రీ మేధా దక్షిణామూర్తి జ్యోతిష నిలయం

మీరు జన్మించిన తేది, సమయం, ప్రదేశం ఈ మూడు సమాచారములు మాకు తెలియచేసినచో మీ వ్రుత్తి,వ్యాపార,ఆరోగ్య,ఆర్ధిక పరిస్తితులు, దాంపత్యం, విద్య, ఉద్యోగ, వివాహ, కుటుంబవ్యవహారాలు, సంతానం, రాజకీయ వ్యవహారాలు,ప్రేమ వ్యవహారములు,కుజ దోషం, కాలసర్ప దోషం మరియు వివాహ, ఉపనయన, గృహప్రవేస, జప, హోమ, వ్రత, అన్నప్రసన, నామకరణం లకు ముహూర్తములు పెట్టబడును. P.V.RADHAKRISHNA CELL :+91 9966455872, Mail us : parakrijaya@gmail.com

16, మార్చి 2013, శనివారం

జన్మలగ్నఫలములు

                              -: జన్మలగ్నఫలములు :-

వివిధ లగ్నములలో జన్నించిన ఫలితమును సారావళి, ఫలదీపిక, జాతక, పారిజాతము, హోరరత్నబృహజాతకము మొదలగు గ్రంధములు ఆధారంగా రాయడమైనది, యివి సామాన్య పరిశీలనలో,అయితే గ్రహసంపత్తిని అనురించి ఫలితములు మార్పు తీసుకొనును.ప్రాధమిక పరిశీలనల కొరకు ఈ గ్రంధాలలో చెప్పబడిన జన్మలగ్న లక్షణాలను ఇందు విశదీకరిస్తాను.
సారవళిలోని నష్టజాతకాధ్యాయములోని హోర,ద్రేక్కణ,నవాంశల ఫలితములను ఆధారము చేసుకొని సంధి లగ్నములో జన్మించిన జాతకుని యొక్క జనన,లగ్న,హోర,ద్రేక్కాణ,నవాంశాలను నిర్ణయించుటకు ఈ అద్యాయమును ఉపకరిస్తుందని సారావళి నుండి యధాతధముగా తీసుకొనుట జరిగినది. దీనికి పారిజాతాది యితర గ్రంధ విశేషములను కూడ వివరించుట జరిగినది. 
 
మేష జన్మలగ్నఫలము

(జాతక పారిజాతము నుండి) బంధు ద్వేషి,తిరుగాడువాడు,కృశించిన శరీరము కలవాడు,క్రోధ స్వభావి,వివాదప్రియుడు,గర్విష్ఠి,స్థిరము లేని ధనము కలవాడు,శూరుడు.(ఫలదీపిక నుండి) గండ్రుని కన్నులు కలవాడు,దుర్భలమగు జానవులు కలవాడు,జలము వలన భయపదు వాడు,మితభుజి,చపచిత్తుడు,స్త్రీ కామకుడు,వ్రణములు కల అవయవము కలవాడు(మానసాగరి నుండి) రక్త గౌరవర్ణము కలవాడు.

మేషలగ్నము యొక్క ప్రధమహోరయందు జన్మించిన క్రౌర్యము,ధనము,అధిక వీర్యము,ఉగ్రురాలగు భార్య గలవాడు,బలిసినవాడు,తీక్షణమైనవాడు,దొంగలకధిపతి యునగును.ద్వితీయహోరయందు పుట్టిన దొంగ,ప్రమాదములు,సన్నని కాలి వ్రేళ్ళు,నిగనిగలాడు వెడల్పగు కండ్లు,నేర్పరి,మిక్కిలి లావైన శరీరము,మంచి మేధ గలవడగును.


మేషరాశి యొక్క ప్రధమ ద్రేక్కాణమున జన్మించిన వాడు దాత,సంపాదించువాడు,లోకమంతట ఖ్యాతి చెందినవాడు,యుద్ధమున మిక్కిలి తీవ్రమైన వాడు,అందమైన స్వరూపము కలవాడు,బంధువులను కఠినముగ శిక్షించువాడు నగును.ద్వితీయ ద్రేక్కాణమున జన్మింఛిన స్త్రీ చాపల్యము,విలాసముగా తిరుగుట,సంభోగము,గానమున ప్రీతి,అభిమానము,స్నేహితుల ధనము లభించుట,మంచి రూపము,భార్యకు సంభంధించిన ధనము ప్రీతికలవాడగును.తృతీయ ద్రేక్కణమున జన్మించిన గుణవంతుడు ,ఇతరులకు పనులు చేయువాడు,రాజసేవ నొనర్చువాడు,బంధుప్రేమకలవాడు,మిక్కిలి ధర్మాత్ముడు,ఆదరము కలవాడు,అంతగా సర్వ విషయములు తెలియనివాడును అగును.
వృషభ జన్మలగ్నఫలము

(జాతక పారిజాతము నుండి) పశుసంపద కలవాడు,దేవ,గురు,బ్రాహ్మణ భక్తి కలవాడు,స్వల్పపుత్ర సంపద కలవాడు,ప్రశాంత చిత్తుడు,తర్కవాదన చేయువాడు,అదృష్ఠశాలి,కామకుడు అగును.(ఫలదీపికనుండి) బలిష్టమైన తొడలు కలవాడు,విశాలమైన ముఖము కలవాడు,వ్యవసాయ ఆశక్తి కలవాడు,దానములయందు ఉదార చిత్తుడు,పార్శ్వములయందు,పృష్ఠభాఘమున పుట్టుమచ్చలు కలవాడు అగును.(మానసాగరి నుండి ) మిత్రజన వియోగి,మానసికరోగి.

వృషభముయొక్క ప్రధమహోరయందు పుట్టిన నల్లని శరీరము,విశాల నేత్రములు, మిక్కిలి సంభోగమున ఇష్టము,లావైన ఎముకలు గల శరీరము,సౌందర్యవంతుడు,ద్వీతీయహోరయందు జన్మించిన పొడవైనది లావైనది గుండ్రనైనదియు నగు శరీరము,గొప్ప బలము,మంచి వెంట్రుకలు,వ్యత్యస్థమగు కటి ప్రదేశము,వృషభము వంటి నేత్రములు గలవాడగును.


వృషభ రాశి యొక్క ప్రధమ ద్రేక్కాణమున జననంబైన ఇష్టులు పానయోగ్య పదార్ధములు భోజన సామాగ్రి భార్య మున్నగు వాటి వియోగము వలన దుఃఖించువాడు,వస్త్రములు,భూషణములు స్త్రీ ఇష్టముతో నడుచుట మున్నగునవి గలవాడనగును.ద్వితీయ ద్రేక్కణమున జన్మించిన లొటు లేని దేహము గలవాడు,స్త్రీలకు చాల ప్రియుడు,మంచి రూపము,ధనము,స్థైర్యము,అభిమానము లోభముగల స్త్రీల యొక్క ప్రేమయు గలవాడగును.తృతీయ ద్రేక్కాణమున జన్మించిన నేర్పరి,కొంచెము పాటి ధనము,పరాక్రమము గలవాడు,మిక్కిలి మలినుడు,మొదట ధనమునార్జించి పిదప దుఃఖించువాడునగును.

మిదున జన్మలగ్నఫలము

(జాతక పారిజాతము నుండి) భోగవంతుడు,దయాశాలి,ధనవంతుడు,గుణవంతుడు,తత్వవేత్త,యోగాత్మ,సుజన ప్రియుడు,సుందరాకారము కలవాడు,అనారోగ్యవంతుడు..(ఫలదీపికనుండి) నల్లటి అందమగు కనులు కలవాడు,స్త్రీ జనప్రియుడు, యితరుల మనోభావములను చెప్పగలవాడు,సంగీత,నృత్యప్రియుడు. .(మానసాగరిలో విశేషము) గౌరవర్ణము కలవాడు,రాజపండితుడు,దూతగా వ్యవహరించేవాడు,ప్రసన్నచిత్తుడు.

మిధున లగ్న ప్రధమ హోర యందు జన్మించిన లావైన నడుము,మిక్కిలి నేర్పు,ఒకపాటి ప్రమాణము గల శరీరము,మృదువగు వెంట్రుకలు,పాదములు,సురతమున ఉత్కటమగు వాంఛ,ధనము ప్రాజ్ఞత కలవాడు నగును.ద్వితీయ హోరయందైన మధురములై విశాలమగు నేత్రములు కలవాడు, కామకుడు, శౌర్యవంతుడు ,మృదువులగు పనులు,మంచి వాక్కు,యితరుల భార్యలను పొందిన వాడు.


మిధున రాశి యొక్క ప్రధమ ద్రేక్కాణమున జన్మించిన లావైన తల కలవాడు,ధనవంతుదు,పొడవైన వాడు,జూదగాడు,గుణముల విలాసముల,రాజు వలన గౌరవము,వాగ్ధాటి కలవాడు అగును.ద్వితీయ ద్రేక్కణమున జన్మించిన చిన్న మొఖము కలవాడు,లొటులేని దేహము,.పొట్టి వెంట్రుకలు కలవాడు, ధన్యుడు, మృదువైనవాడు, గొప్పబుద్ధి, ప్రతాపము, యశస్సు గలవాడు అగును.తృతీయ ద్రేక్కాణమున జన్మించిన స్త్రీలను ద్వేషించువాడు,గొప్ప శిరస్సు కలవాడు,శత్రువులు కలవాడు,పొడవైన వాడు,పురుషమైన గోళ్ళు పాదములు నిలకడలేని ధనవైభవము ధారుఢ్యము గలవాడగును.
కర్కాటక జన్మలగ్నఫలము

(జాతక పారిజాతము నుండి) మృష్టాన్నము,వస్త్రభూషణములు కలవాడు,ప్రియవాక్కులు కలవాడు,కపటస్వభావి,ధర్మవంతుడు,స్థూలకాయుడు,(ఫలదీపిక నుండి) స్త్రీలచే జయింపబడినవాడు.ఎత్తైన కటిప్రదేశము కలవాడు,పొట్టివాడు,మేధావి,రాజప్రియుడు.(మానసాగరిలో విశేషము) పిత్త ప్రకృతి కలవాడు,జలక్రీడా ప్రియుడు,సేవకులచే అభిమానింపబడేవాడు.

కర్కాటక ప్రధమహోరయందు జన్మించిన పొడవగు దేహము,మంచి శిరస్సు,ప్రగల్భమగు బుద్ధి,తక్కువ చూపు,పోకిరితనము,నల్లనుఇ శరీరము,కృతఘ్నత గలవాడు,విరిగిన ముందుపన్ను గలవాడు నగును.ద్వితీయహోరయందైన జూదములను,దేశాటనమున ఇష్టము కలవాడు,విశాలమగు వక్ష స్థలము,కఠినమగు శరీరము,మిక్కిలి కోపము కలవాడు,ప్రయాణ సంపన్నుడును అగును.


కర్కట రాశి యొక్క ప్రధమ ద్రేక్కణమున జన్మించిన దేవ బ్రాహ్మణుల యెడ భక్తి చెంచలమగు స్వభావము,పచ్చని సరీరము గలవాడు,ఇతరులకు సేవ చేయువాడు, బుద్దిమంతుడు, శుభాచారములు గల భార్య సౌందర్యము గలవాడు,ప్రియమైన వాడు నగును.ద్వితీయ ద్రేక్కణమున జన్మించిన లోభి,తీపి భుజించువాడు,స్త్రీవలన ఓడిపోవువాడు,అభిమానము సోదరులు విలాసము చాంచల్యము అనేక రోగములు గలవాడు నగును.తృతీయ ద్రేక్కాణమున జన్మించిన స్త్రీ చాపల్యము ధనము పరదేశములయందు వశించుట,మద్యములయందు ప్రీఎ\తి కలవాడు, సత్పురుషుడు, అరణ్యముల యందు సంచరించువాడు,చూపు తగ్గిన వాడు,మాలికలను ధరించువాడు నగును.

సింహ జన్మలగ్నఫలము

(జాతక పారిజాతము నుండి) స్వల్ప పుత్ర సంతతి కలవాడు,హింసాప్రవృత్తి కలవాడు,సంతుష్టుడు,శూరుడు,రాజవశీకరుడూ,శతృవిజేయుడు,కామకుడు.(ఫలదీపిక నుండి) పింగలవర్ణము వంటి కన్నులు కన్నులు వాడు,విశాలమైన ముఖము కలవాడు,మాతృ విధేయుడు,స్థిర చిత్తుడు.(మానసాగరి విశేషము) వాత పిత్త ప్రకృతి కలవాడు,ప్రగల్భుడు.

సింహ ప్రధమహోరయందు జన్మించిన ఎర్రని కన్ను యొక్క కొనలు కలవాడు,ప్రగల్భమైన వాడు,పొడవైన దేహము,కపటము,సౌఖ్యము,స్థిరములగు పనులు బలము గలవాడగును.ద్వితీయహోరయందు జన్మించిన స్త్రీలను మృష్ఠాన్నములను పానీయములను,వస్త్రములను కోరువాడు,మిక్కిలి దుష్కార్యములు కఠినములగు అవయవములు గలవాడు,దాత,మార్గమున చరించువాడు,కొంచెము సంతానము భోగము స్థిరములగు స్నేహితులు గలవాడు నగును.


సింహలగ్నము యొక్క ప్రధమ ద్రేక్కణమున జన్మించిన దాత,పోషించువాడు శతృవులను జయించువాడు,చాలా ధనము స్త్రీలు స్నేహితులు గలవాడు,అనేక రాజులను గొల్చు వాడు,మంచి బలము గలవాడు నగును.ద్వితీయ ద్రేక్కణమున పుట్టిన మంచి పనులు జేయువాడు దాత,నిలకడ గలవాడు,అందమైన వాడు,యుద్ధమున ఇష్టము గలవాడు,శౌఖ్యము,వేదవిహితములగు ధర్మములయందు ప్రీతి విశాలమగు బుద్ధి గలవాడగును.తృతీయ ద్రేక్కాణమున జన్మించిన యితరుల ధనము నపహరించు ఆశ కలవాడు,ఆరోయవంతుడు,స్తభ్ధుడు,గొప్పబుద్ధి కలవాడు,జూదగాడు,పొట్టి శరీరము కలవాడు,అనేక మంది సంతానము గలవాడు,ప్రతిభాశలియునగును.
కన్యా జన్మలగ్నఫలము

(జాతక పారిజాతము ) కార్యనిపుణుడు,ధనవంతుడు,సత్బుద్ధి కలవాడు,పండితుడు,మేధావి,వనితా విలాస రసికుడు,బంధుప్రియుడు,సాత్వికుడు.(ఫలదీపిక నుండి) కృశించిన బాహువులు కలవాడు,పరుల ఆస్తులు అనుభవించువాడు,ప్రియభాషి,పరిమిత సంతతి కలవాడు.(మానసాగరి నుండి) కఫ,పిత్త ప్రకృతి కలవాడు,మాయావి,భయస్తుడు.

కన్యాలగ్న ప్రధమహోరయందుజన్మించిన సుకుమారమగు దేహము,అందము,మంచి మాటలు,గానమున ప్రజ్ఞ,స్త్రీలయొక్క ప్రేమ,శ్రేష్టతగలవాడగును.ద్వితీయహోరయందు జన్మించిన పొట్టివాడు పంతమునకై చదువుకొనువాడు ,లావైన తల వివాదము సేవించుట యందు,చిత్ర పటము వ్యాయుట యందు,అక్షరములను వ్యాయుట యందు నేర్ప,క్షయ వృద్ధులు,సౌఖ్యము కలవాడగును.


కన్యారాశి యందలి ప్రధమద్రేక్కణమున జన్మించిన నల్లని వాడు,మంచి వాగ్ధాటి వినయము,పొడవైన శరీరము కలవాడు,సుకుమారుడు,స్త్రీ వలన భాగ్యము నందు వాడు, అస్థిరమైనవాడు, పొడవైన శిరస్సు కలవాడు,తేనె వలె తీయని మాటలనువాడు నగును.ద్వితీయ ద్రేక్కణమున జన్మించిన ధైర్యము, విదేశములలో నివసించుట, శిల్పశాస్త్రమున పాండిత్యము యుద్ధమున నేర్పు నిరర్ధకములగు పలు మాటలు పలుకు వాడు మాట నాలించువాడు అరణ్యవాసులకు ఇష్ఠుదు నగును.తృతీయ ద్రేక్కణమున జన్మించిన గానము చేయ వాడు,ఇతరుల సొత్తునపహరించువాడు,సంగీతమున ప్రేమగలవాడు గలవాడు,రాజ ప్రేమగవాడు,పొట్టి వాడు,పెద్ద తల ,నేత్రములు గలవాడునగును.
తులా జన్మలగ్నఫలము

(జాతక పారిజాతము నుండి) సుందర వదనము కలవాడు,లావణ్యమైన కన్నులు కలవాడు ,రాజ పూజితుడు,విద్వాంసుడు,రతీలోలుడు,స్త్రీ,ధన క్షేత్రములు కలవాడు,విశాలమగు పళ్ళ వరుస కలవాడు,శాంతచిత్తుడు,విషాదగ్రస్తుడు,చెంచల స్వభావి,భయస్తుడు.(ఫలదీపిక నుండి) సన్నని శరీరము కలవాడు,స్వల్పసంతతి కలవాడు ,దేవ బ్రాహ్మణులయందు అమిత భక్తి కలవాడు,పొడగరి,వాణిజ్యమునందు నేర్పరి,ధైర్యశాలి.(మానసాగరి నుండి) కఫ,ప్రకృతి కలవాడు.

తులా ప్రధమహోరయందు జన్మించిన గుండ్రని ముఖము, ఎతైనముక్కు,నల్లని పొడవగు నేత్రములు, విలాసములు, బలిసిన దేహము, ధనము, బందువుల యెడ ప్రీతీ గలవాడు, ద్వితీయహోరయందు జన్మించిన గొప్ప ధనము, నల్లని పొట్టి వెంట్రుకలు, గుండ్రనికండ్లు, మంచి శరీరము, అల్పము లగు పాదగ్రములు గలవాడునగును.


తులారాశియొక్క ప్రధమ ద్రేక్కాణమున జన్మించిన మన్మధునివలె సౌందర్యవంతుడు,మార్గమున పోవనెరిగినవాడు,నల్లని వాడు,వర్తకమొనర్చువాడు,నియోగించుటయందు ధైర్యము కలవాడు,మేధావంతుడు నగును.ద్వితీయ ద్రేక్కణమున జన్మించిన పద్మములవలె విశాలమైన నేత్రము గలవాడు,మంచి రూపము,వాగ్ధాటి సాహసము,భుషణములు తన వంశమున పేరుగన్న పెద్దలననుసరించి గలవాడు నగును.తృతీయ ద్రేక్కణమున జన్మించిన చపలచిత్తుడు, శఠు(డు, కృతఘ్నుడు, కురూపి, కపటి, స్నేహితుడు, ధనము, ప్రఖ్యాతి నశించినవాడు స్వల్పబుద్ధి కలవాడు నగును.
వృశ్చిక జన్మలగ్నఫలము

(జాతక పారిజాతము నుండి) మూర్ఖుడు, క్రూరదృష్టి కలవాడు, చంచల స్వభావి, గౌరవనీయుడు, చిరాయువుకలవాడు ధని విద్వాంసుడు,సజ్జన ద్వేషి, విషాద విషయములలో ప్రియత్వం కలవాడు.(ఫలదీపిక నుండి) గుండ్రని తొడలు కలవాడు, విశాల ప్రస్పుట నేత్రములు కలవాడు, విశాల వక్షస్థలం కలవాడు, బాల్యవస్థ నుండి వ్యాది పీడితుడు, రాజసమ్మానితుడు. (మానసాగరీ నుండి ) వృద్ధ స్వభవుడు, క్రోధి.

వృశ్చిక పూర్వార్ధమున జనించిన ఎర్రని కొనలు కల్గి పచ్చనైన నేత్రములు ,సాహసములైన పనులు, యుద్ధమున పరాక్రమము, చెడు ప్రవర్తన గల స్త్రీ యెడ ప్రేమ , ధనము గలవాడు, ద్వితీయహోరయందు జన్మించిన మిక్కిలి పొడవు, లావు గల శరీరము, రాజసేవ, చాల ఋణములు, స్నేహితులు, స్పుటమైన నేత్రములు గవాడగను.


వృశ్చికలగ్నము యొక్క ప్రధమ ద్రేక్కాణమున జన్మించిన శరీరము గలవాడు, స్థిరమైన వాడు, మక్కిలి కొపమ్ కలవాడు, యుద్ధమున గొప్ప సామర్ధ్యము గలవాడు, వశాలమగు నేత్రములు లావైనదియు పొడవైనదియు నగు శరీరము గలవాడు, కలియుగాచారములయందు, ప్రీతి గలవాడు నగును. ద్వితీయ ద్రేక్కాణమున జన్మించిన మృష్టాన్నము, పానియములు, నిలకడలేని నేత్రములు. బంగారమువలే పచ్చనైన దేహము,సౌందర్యము,ఇతరులసొత్తు,మంచినడవడి మంచి కళలుగలవాడగును. తృతీయ ద్రేక్కాణమున జన్మించిన గడ్డము మీసములు శరీరమున రోమములు లేనివాడు,ఘాతకుడు,పచ్చనికండ్లు, గలవాడు, గొప్పకడుపు గలవాడు.ఇతరుల దండించువాడు,సోదరులనుండి విడిపోయినవాడు.బలిసిన బాహువులు గలవాడు,ధైర్యము గల హృదయము గలవాడు నగును.
ధనుస్సు జన్మలగ్నఫలము

(జాతక పారిజాతము నుండి) ప్రజ్ఞావంతుడు,కులశ్రేష్టుడు,ధనవంతుడు,యశస్వి,అభివృద్ధి త్వరగా పొందువాడు.(ఫలదీపిక నుండి) పొడుగాటి ముఖము,గొంతు కలవాడు,పెద్ద చెవులు,ముక్కు కలవాడు, తన కార్యములందే నిమగ్నమగువాడు,హ్రస్వ శరీరుడు, రాజప్రియుడు, బలాఢ్యుడు, దయాళువు. (మానసాగరి నుండి ) కార్య ప్రవీణుడు ,దైవ,బ్రహ్మణప్రియుడు.

ధనుర్లగ్న ప్రధమహోరయందు జన్మించిన నోటి పూత,వెడల్పగు రొమ్ము,చిన్న నేత్రములు,దవడలు గలవాడు పసితనముననే తల్లిదాండ్రులు లేని వాడు,తపస్సు చేయువాడు నగును,ద్వితీయహోరయందు జన్మించిన పద్మములవంటి నేత్రములు,పొడవగు బాహువులు,శాస్త్రమున పరిచయము,మంచి దేహము,ధన్యత గలవాడు,సౌఖ్యవంతుడు,కీర్తిగలవాడు అగును.


ధనుర్లగ్నముయొక్క ప్రధమద్రేక్కాణమున జన్మించిన గుండ్రని కండ్లు ముఖము,మంచి గుణములు గలవాడు,స్వయముగా నభవృద్ధినొందువాడు,మంచి ఆచారములు,మార్ధవము గలవాడు నగును. ద్వితీయద్రేక్కాణమున జన్మించిన శాస్తార్ధమునెరిగిన వాడు మంచి వక్త,మంత్ర శాస్త్రవేత్తలలో అగ్రగణ్యుడు,అనేక తీర్ధముల దేవాలయములు సంచరించువాడు నగును.తృతీయద్రేక్కాణమున జన్మించిన బంధువులలో ప్రాధాన్యము,నేర్పు సత్పురుషుల కాశ్రయుడు,ధర్మ పరాయణత,అభిమానము,ఇతర స్త్రీలతోటి పొత్తు, మంచి రూపము, యశస్సు, విజయము గలవాడు నగును.

మకర జన్మలగ్నఫలము

(జాతక పారిజాతము నుండి) రమణీలోలుడు,శఠారులు,దీనవాక్యములు పలుకువాడు..(ఫలదీపిక నుండి) శరీరములో అధో భాగములు కృశించినవిగా కలవాడు.(మానసాగరి నుండి) భయస్తుడు,ఇతరులను మోసగించువాడు,ధూర్తుడు,కఫ,వాత,ప్రకృతి కలవాడు.

మకర ప్రదమహోరయందు జన్మించిన నల్లని దేహము,సింహము వంటి నేత్రములు కలవాడు,ధన్యుడు,స్త్రీ వలన జయింపబడనివాడు,ప్రసన్నరూపము గలవాడు,పోకిరి,సంపన్నుడు,మృష్టాన్నము నారగించువాడు ,మంచి పనుల నొనర్చువాడు,సన్నని పెద్ద ముక్కు గలవాడు నగును.ద్వితీయహోరయందు జన్మించిన ఎర్రని కనుబొమ్మలు గలవాడు, సోమరీ, ఎల్లప్పుడు మార్గమున సంచరించువాడు, మూర్ఖుడు, నల్లనిదియు అంతటను రోమములు గల్గిన దేహము, మిక్కిలి తీవ్రత,సాహసము, రౌద్రత, గల పనులు గలవాడగును.


మకరలగ్నముయొక్క ప్రధమద్రేక్కణమున జన్మించిన పొడవగు బాహువులు గలవాడు, నల్లనివాడు, గొప్పకీర్తి కలవాడు, మంచి రూపము,కాంతిశౌఠ్యము గలవాడు,నవ్వుచు మాట్లాడువాడు, స్త్రీలవలన ఓడిపోవు వాడు, అందమగు వ్యాపారములు ధనముగలవాడు నగును.ద్వితీయద్రేక్కాణమున జన్మించిన చిన్న ముఖము చాపల్యము,స్త్రీ పరధనముల నపహరించుట,నేర్పు,సజ్జనులు నడువడి నెరుగుట, దానము, దురంతములగు పాదములు గలవాడగును.తృతీయద్రేక్కాణమున జన్మించిన వాచాలత గలవాడు, మలినుడు,కృసించువాడు,పొడవైనవాడు,తండ్రిలేనివాడు,విదేశగమనముల వలన దుఃఖములు నొందువాడు నగును.
కుంభ జన్మ లగ్న ఫలము

(జాతక పారిజాతము నుండి) మూర్ఖ మనసు, రతీకేళీ లోలుడు,కార్పణ్య స్వభావి, ధనవంతుడు అగును. (ఫలదీపిక నుండి) కుండాకార శరీరాకృతి కలవాడు, సుగంధప్రియ, పరధనాపేక్ష కలవాడు.(మానసాగరి నుండి) స్థిర స్వభావి,వాతా ప్రకృతి,జలక్రీడాప్రియుడు,శిష్ఠాచారి,జనప్రియుడు.

కుంభ ప్రధమహోరయందు జన్మించిన స్త్రీ మిత్రుల సౌఖ్యము కలవాడు,మ్రుదువైన వాడు,కొలదిపాటి పుత్రులు,సద్గుణములు,శౌర్యము,సూర్యుని వలె ఎర్రనగు దేహము,దేశాటనమున ప్రీతి , గలవాడగును. ద్వితీయ హోరయందైన ఎర్రని నేత్రములు,చిక్కిన దేహములు కలవాడు,పొట్టివాడు,సోమరి,ప్రతిక్రియ యెనర్చు వాడు,దుఃఖవంతుడు,లోభి,దుర్మార్గుడు అగును.


కుంభ లగ్నముయొక్క ప్రధమద్రేక్కనమున జన్మించిన స్త్రీలు,మానము,కీర్తి,రూపము,గొప్ప ప్రభావము కలవాడు,పొడవైన వాడు,కార్యములు ఓపికతో జేయువాడు,ధనవంతుడు,రాజసేవకుడు నగును. ద్వితీయ ద్రేక్కణమున జన్మించిన లోభి,సమర్ధుడు, మధురముగా మాటలాడువాడు,పచ్చని దేహము,పచ్చని భీకరములగు కండ్లు,పరిహాసము చేయు అలవాటు గలవాడు,దాటి గల మాట గలవాడు, బుద్ధిమంతుడు, స్నేహితులు విరివిగా గలవాడు నగును.తృతీయ ద్రేక్కాణమున జన్మించిన పొడవైన వాడు, పోకిరి, ప్రతాప వంతుడు, పొట్టి చేతులు కలవాడు,పుత్రుల వలన ధనమునొందువాడు,స్తభ్ధత గకవాడు, అసత్యము చెప్పువాడు, కపటి చీలిన నేత్రము కలవాడు,సంభోగమున చతురుడు నగును.

మీన జన్మలగ్నఫలము
(జాతక పారిజాతము నుండి) సాధారణ రతి వాంఛ కలవాడు,ఇష్టజనానుకూలుడు,తేజస్సు,బలము కలవాడు,ధన్యధాన్యములతో తులతూగువాడు అగును..(ఫలదీపిక నుండి) నీరు ఎక్కువగా త్రాగువాడు,విద్యావంతుడు,సులోచనుడు,అదృష్టవంతుడు,కృతఘ్నుడు అగును.(మానసాగరి నుండి) పిత్త ప్రకృతి,అతిక్రోధి.

మీనలగ్న ప్రధమహోరయందు పుట్టిన వాడు పొట్టివాడు,మంచిసౌందర్యము గల దేహము,వెడల్పగు నొసలు,వక్షస్థలము,స్త్రీల యెడ ప్రీతి,గొప్ప కీర్తి,కార్యముల పట్టుదల,శౌర్యము గలవాడు అగును.ద్వితీయ హోరయందు జన్మించిన ధాత్రుత్వము,పొడవగు ముక్కు,నేర్పు,చురుకైన బుద్ధి,సోభనకరములగు నేత్రములు, రాజప్రీతి ,స్త్రీలకు ప్రియుడగుట,సౌందర్యము,మంచిమాటలు గలవాడగును.


మీనలగ్నముయొక్క ప్రధమద్రేక్కాణమున జన్మించిన తేనెవంటి పచ్చని కండ్లు గలవాడు, పచ్చని శరీరము గలవాడు, సౌఖ్యవంతుడు, నీటియందు ప్రయాణము చేయువాడు, వినయవంతుడు నగును.ద్వితీయద్రేక్కాణమున జన్మించిన స్త్రీ లకు సేవించువాడు, మృష్టాన్నము నారగించువాడు, ఇతరులధనము ననుభవించువాడు,కాముకుడు, స్త్రీ లయందు, సత్పురుషులయందు ప్రేమ కలవాడు, వాగ్దాటి గలవాడు నగును.తృతీయ ద్రేక్కణమునందు జన్మించిన నల్లనివాడు, కళలయం దారితేరినవాడు, పెద్దపాదములు గలవాడు, మృష్టాన్నము దివ్యములగు పానియములు గలవాడు, పరిహాస నిపునుడు నగును. 

ఈ బ్లాగును సెర్చ్ చేయండి



Related Posts Plugin for WordPress, Blogger...