సూర్య:-
రవి లగ్నమందున్న ఫలము :
రవి లగ్నగతుడయిన అట్టి జాతకుడు అల్పకేశయుతుడు, చిరుపలుకులకే అలసత్వము
నొందినవాడు, క్రోధి - ప్రచండస్వభావి - పొడగరి - గర్వి - అల్పదృష్టికలవాడు -
ఉద్రేకి - కౄరహృధయుడు - నిర్గుణుడు అగును. అది కర్ణాటక లగ్నమయి అందు
రవియున్న కనులయందు పూవులు కలవాడు, మేషము లగ్నమయి అందు రవియున్న నేత్రవ్యాధి
పీడితుడు; రవి సింహమందుండి సింహలగ్నమయిన రేచీకటి కలవాడు; తులాలగ్నమయి అందు
రవియున్న దారిద్ర్యపీడితుడూ, సంతాననష్టము పొందువాడూ అగును.
రవి ద్వితీయ, తృతీయ, చతుర్థములలో యున్న ఫలములు :
రవి ద్వితీయమునయున్న విద్యాహీనుడు, వినయములేనివాడు, నిర్ధనుడు,
దుర్వచనప్రియుడు అగును. రవి తృతీయమునయున్న బలవంతుడు, ధైర్యవంతుడు,
ధనవంతుడు, ఉదారుడూ అగును. కానీ, ఆప్తులయందు ద్వేషస్వభావియగును. రవి
చతుర్థమునయున్న అట్టిజాతకుడు సుఖహీనుడు, బంధువులు లేనివాడు, క్షేత్రహీనుడు,
స్నేహహీనుడు, గృహములేనివాడు అగును. ప్రభుత్వ ఉద్యోగి అగును.
పిత్రార్జితమంతయా ఖర్చు పెట్టును.
రవి పంచమ, షష్ట, సప్తమ, అష్టమలయందున్న ఫలము :
రవి పంచమముయందున్న సుఖ, పుత్రహీనుడు, మరియూ అల్పాయుష్మంతుడు, జ్ఞాని,
అరణ్యప్రదేశములయందు తిరుగువాడు అగును. రవి ఆరవయింటనున్న జాతకుడు రాజు,
ఖ్యాతివంతుడు, ధనవంతుడు, విజయవంతుడు అగును. రవి యెనిమిదవ భావమున యున్న
జాతకుడు తన ఆస్తిని పోగొట్టుకొనును. మిత్రనష్టము, అల్పాయుష్మంతుడు
దృష్టిలోపము కలవాడగునో - అంధుడగునో యుండును.
రవి భాగ్య, రాజ్య, లాభ, వ్యయ క్షేత్రముల యందున్న ఫలము :
భాగ్యమున రవియున్న తండ్రిలేనివాడు, బంధుమిత్రపుత్రవంతుడు, దేవబ్రాహ్మణ
భక్తి కలవాడూ అగును. రాజ్యకేంద్రమున రవియున్న జాతకుడు పుత్రవంతుడు,
వాహనయుతుడు, కీర్తియశస్సు, భాగ్యమూకలవాడు, రాజూ అగును. రవి
లాభస్థానమునయున్న జాతకుడు బహుధనవంతుడు, చిరంజీవి యగును. రాజు అగును. మరియూ
విగశోకవంతుడు అగును. ద్వాదశమున రవియున్న పితృద్వేషి దోషదృష్టి కలవాడు,
నిర్ధనుడు, అపుత్రవంతుడు అగును.
చంద్ర :-
చంద్రుడు లగ్న, ద్వితీయ, తృతీయములయందున్న ఫలము :
చంద్రుడు లగ్నమందున్న అట్టిజాతకుడు ధృడశరీరవంతుడూ, చిరంజీవి, నిర్భయుడూ,
బలిష్ఠుడూ, ధనవంతుడు అగును. ( వృద్ధి చంద్రుడు ). క్షీణచంద్రుడయిన పై
ఫలితములకు వ్యతిరిక్తము అగును. చంద్రుడు ద్వితీయమునందున్న జాతకుడు
ధనవంతుడు, విద్యావంతుడు, మృదుభాషి యేదేని అంగవైకల్యమూ కలుగును. చంద్రుడు
మూడవయింటనున్న జాతకుడు సోదరులు కలవాడు, ప్రమదాజమనస్కుడు, బలవంతుడు,
శౌర్యవంతుడు, అయిననూ బహుకష్టములు పొందును.
చంద్రుడు చతుర్థ, పంచమ, షష్ట ద్వాదశభావములయందున్న ఫలము:
చంద్రుడు చతుర్థభావమునయున్న జాతకుడు సుఖీ, భోగీ, దాతా, మిత్రులు కలవాడు,
వాహనములు కలవాడు, కీర్తివంతుడుగా వెలుఒందును. చంద్రుడు పంచమమునయున్న
జాతకుడు సుపుత్రులు, సుమేథాసంపద, ఠీవీ, మంత్రిపదవి నలంకరించువాడూ యగును.
ఆరవయింట చంద్రుడు యున్న జాతకుడు అల్పజీవి, అమాయకుడు, ఉదరశూలతో బాధపడువాడూ,
దైన్యత్వముకలవాడునూ యగును. సప్తమమున చంద్రుడుయున్న జాతకుడు సౌమ్యవంతుడు,
సుందరయువతీ హృదయారవిందుడు, అతి సుందర వంతుడునూయగును. ( సౌందర్యవతి యగ్గు
భార్య సంప్రాప్తమగును. )
చంద్రుడు అష్టమ, నవమ ,దశమ , లాభ ద్వాదశభావములయందున్న ఫలము :
అష్టమభావమున చంద్రుడు, జాతకుని రోగపీడితుడ్నిగనూ, అల్పాయుష్మంతునిగనూ
చేయును. నవమభావమున చంద్రుడు అభివృద్ధిపరునిగనూ,పవిత్రునిగనూ,
పుత్రవంతునిగను, విజయునిగను, కార్యారంభముననే శుభఫలములందుటా మొదలగు ఫలములని
సహాయము చేయు మనస్కుడూ అగును. ఏకాదశమమున చంద్రుడుయున్న జాతకుడు
విశాలహృదయుడూ, చిరంజీవీ, ధనవంతుడూ యగును. ద్వాదశభావమున చంద్రుడు యుండ
జాతకుడు ద్వేషి, దుఃఖి, క్లేశములననుభవించువాడు, అవమానింపబడినవాడు,
నిరుత్సాహి యగును.
మంగళ:-
కుజుడు లగ్న, ద్వితీయ, తృతీయ, చతుర్థములయందున్న ఫలము :
లగ్నమునందుకుజుడు యున్న, అట్టిజాతకుడు, క్షతగాత్రుడు, కౄరుడు
అల్పాయుష్మంతుడు, సాహసియగును. కుజుడు ద్వితీయమునందున్న జాతకుడు -
కురూపవంతుడు, విద్యావిహీనుడు, ధనహీనుడు, దుష్ప్రజలమీద ఆధారపడువాడూ యగును.
తృతీయమునందు కుజుడుయున్న జాతకుడు మంచిఅలవాట్లు కలవాడు, ధనవంతుడు,
ధైర్యశాలి, అప్రతిహతుడు, సుఖవంతుడు, సోదరశూన్యుడూ యగును. చతుర్థమున
కుజుడుండిన జాతకునకు మిత్ర, మాతృ, భూ, గృహ, సుఖ, వాహనముల లేమి కలుగును.
కుజుడు పంచమ, షష్ట, సప్తమ, అష్టమ భావములయందున్న ఫలము :
పంచమ భావమున కుజుడున్న అట్టిజాతకుడు సుఖహీనత, నిస్సంతు, అల్పమేథావి,
భాగ్యములకు అనర్ధములు కలుగును. కుజుడు షష్టభావమునయున్న జాతకుడు -
అతికాముకుడు, ధనవంతుడు కీర్తికలవాడు, విజయుడూ అగును. కుజుడు
కళత్రభావమునయున్న జాతకుడు దుశ్చరితుడు, వ్యాధిపీడితుడు, వృధాత్రిప్పట,
భార్యానష్టము కలుగును. అష్టమమున కుజుడుండిన జాతకుడు అంగవైకల్యము పొమ్దును.
నిర్ధనుడు, అల్పజీవి, జననిందితుడు అగును.
కుజుడు భాగ్య, రాజ్య, లాభరిఃఫ స్థానములయందున్న ఫలము :
కుజుడు భాగ్యభావమునయున్న జాతకుడు రాజమిత్రుడు, ప్రజలచే ద్వేషింపబడువాడు,
పితృహీనుడు, జనఘాతకుడు అగును. కుజుడు రాజ్యప్రభావమున యున్న జాతకుడు
కౄరస్వభావము కలరాజగును. విశాలహృదయుడు, ప్రజామన్ననలందుకొనువాడగును. కుజుడు
ద్వాదశభావమునయున్న జాతకుడు ధనసుఖములతో తులతూగువాడు, ధైర్యశాలి,
విగతశోకవంతుడు, సచ్ఛరిత్రుడూ యగును.
బుధ:-
బుధుడు లగ్న, ద్వితీయ, తృతీయ, చతుర్థ భావములయందున్న ఫలము :
లగ్నమున బుధుడుండిన జాతకుడు దీర్ఘాయుష్షుకలవాడు, మృదుమధుర
వాక్సంపన్నుడు, సునిశిత హాస్యవాక్చాతురుడు అగును. బుధుడు ద్వితీయమునయున్న
జాతకుడు స్వశక్తితో ఆస్తులను సంపాదించువాడు, కవి - ఆకర్షణీయమయిన
ప్రస్ఫుటవాక్కులు కలవాడు యిష్ఠాన్నభోక్తయగును. బుధుడు తృతీయమునయున్న
జాతకుడు ధైర్యశాలి, శూరుడు, సమ ఆయుష్మంతుడు, సత్సోదరయుతుడు, అలసట పొందు
స్వభావము కలవాడునగును. బుధుడు చతుర్ధభావమునయున్న జాతకుడు విద్యావంతుడు
హాస్యవచో విశారదుడు, భూమి, మిత్రులు, ధాన్య, ఐశ్వర్యము - సంతోషముతో
కూడినవాడు యగును.
బుధుడు పంచమ, షష్ట, సప్తమ, అష్టమ స్థానములయందున్న ఫలము :
పంచమభావమున బుధుడుండిన జాతకుడు విద్యావంతుడు, సుఖవంతుడు, శౌర్యవంతుడు,
మంత్రవిద్యాభినివేశి, పుత్రవంతుడు అగును. బుధుడు షష్టమభావమునయున్న జాతకుడు
వివాదాస్పదుడు, క్రోధి, నిష్టురవాకులయందు నేర్పరి, రిపునాశనకర్త, అలసట
కలవాడు, నిష్టురోక్తిపరుడు అగును. బుధుడు సప్తమమున యున్న జాతకుడు
విద్యావంతుడు, సుందరవస్త్రధారి, ఔన్నత్యవంతుడు, ధనసంపన్నవతియగు
భార్యగలవాడూయగును. బుధుడు అష్టమమునయున్న జాతకుడు మిక్కిలి ప్రఖ్యాత్వంతుడు,
చిరంజీవి, కుటుంబమునకు అండగా యుండుట, ప్రభువు లేక సేనానివహము లకధిపతి
యగును.
బుధుడు భాగ్య, రాజ్య, లాభ, వ్యయభావములయందున్న ఫలము :
బుధుడు భాగ్యభావమునయున్న జాతకుని విద్య, ఐశ్వర్యమూ, సచ్ఛరిత్ర, ఆచారము,
ప్రావీణ్యము, స్వచ్ఛమగు, వాక్కులు గలవానినిగాచేయును. బుధుడు రాజ్యకేంద్రమున
యున్న జాతకుడు తానారంభించు సకలకార్యములయందునూ విజయుడూ, మంచివిద్య, శక్తి,
మేథ, సుఖము, సత్ప్రవర్తన, సత్యసంధత కలవాడును యగును. బుధుడు
యేకాదశభావమునయున్న జాతకుడు చిరంజీవి, సత్యసంధుడు, బహుధనవంతుడు, సుఖీ మరియూ
సేవాజనము కలవాడునగును. బుధుడు ద్వాదశభావమునయున్న జాతకుడు కష్టజీవి,
విద్యాహీనుడు, నమ్రతతో యుండువాడు, కౄరుడు, నిస్తేజుడూ యగును.
గురు:-
గురుడు లగ్న, ద్వితీయ, తృతీయ, చతుర్ధ భావములయందున్న ఫలము :
గురుడు లగ్నకేంద్రమునయున్న జాతకుడు రూపవంతుడు, అదృష్టవంతుడు, చిరంజీవి,
నిర్భయుడు, సంతానవంతుడు అగును. గురుడు ద్వితీయమున యున్న జాతకుడు స్వచ్చమగు
వాకులు గలవాడు, భోజనప్రియుడు, సుందరవదనుడు, ధనవంతుడు, విద్యావంతుడు అగును.
గురుడు తృతీయమునయున్న జాతకుడు అమర్యాదస్తుడు (మర్యాద తెలియనివాడు),
కష్టముతో జీవించువాడు, ఖ్యాతిగల సోదరవర్గము కలవాడు, పాపములు చేయువాడు,
మావియగును. చతుర్దభావమున గురుడుండిన జాతకుడు మిత్ర మాతృ సేవాజనముతో
జీవించువాడు, భార్యాపుత్ర ధనధాన్య సంపద్విభవుడు, సుఖీ అగును.
గురుడు పంచమ, షష్ట, సప్తమ, అష్టమ స్థానములందున్న ఫలము :
గురుడు పంచమభావమునయున్న జాతకుడు పుత్రులవలన క్లేశములు గలవాడు అగును.
మరియూ మేథావి, రాజసచివునిగను యుండును. గురుడు షష్టమునయున్న జాతకుడు
నిరుత్సాహి, అగౌరవములు పొందువాడు, శతృనాశనకారి, మంత్రాభినివేశము కలవాడగును.
గురుడు సప్తమమునయున్న జాతకుడు సత్కళత్ర, సుపుత్రులను బడయును,
వినయసంపన్నుడు, అతి ఉదారుడూ అగును. గురుడు అష్టమమునయున్న జాతకుడు
కడుబీదవాడగునూ, బహుతక్కువ సంపాదనాపరుడు, పాపి, అయిననూ చిరంజీవి అగును.
గురుడు భాగ్య, రాజ్య, లాభ, వ్యయ భావములయందున్న ఫలము :
గురుడు భాగ్యమందున్న జాతకుడు ఖ్యాతి వహించిన మంత్రిగనూ, సంతతీ ఐశ్వర్యము
గలవానిగానూ, పవిత్రకార్యాభిలాషిగనూ యుండును. గురుడు రాజ్యము నందున్న
జాతకుడు బుజువర్తనుడు, తన పవిత్రకార్యములచేత ప్రఖ్యాతి వహించినవాడు,
బహుధనవంతుడూ, రాజమిత్రుడూ అగును. గురుడు లాభమునందుయున్న జాతకుడు ధనవంతుడు,
నిర్భయుడు, అల్పసంతానవంతుడు; చిరంజీవి, వాహనయానపరుడు అగును. గురుడు
ద్వాదశమునయున్న జాతకుడు యితరుల చేత అసహ్యించుకొనబడువాడు. అసంగతప్రలాపి,
అప్త్రవంతుడు, పాపకృత్యములు చేయువాడు అలసినవాడు అగును.
శుక్ర:-
శుక్రుడు లగ్న, ద్వితీయ, తృతీయ, చతుర్ధములయందున్న ఫలము :
శుక్రుడు లగ్నమునందున్న జాతకుడు ఆరోగ్యవంతుడు, సుందర శరీరుడు, సుఖీ,
చిరంజీవి అగును. శుక్రుడు ద్వితీయమునందున్న జాతకుడు కవి - బహువిధములుగా
ఆస్తులు కలవాడు అగును. శుక్రుడు తృతీయమందున్న భార్యాహీనుడు కష్టవంతుడు,
బీదవాడు, దుఃఖి, అవిఖ్యాతుడు అగును. శుక్రుడు చతుర్ధమునయున్న జాతకుడు మంచి
వాహనములు కలవాడు, మంచి గృహము కలవాడు, నగలు, వస్త్రములు, సుగంధద్రవ్యములు
గలవాడుగనూ యుండును.
శుక్రుడు పంచమ, షష్ట, సప్తమ, అష్టమ స్థానములయందున్న ఫలము :
శుక్రుడు పంచమమునయున్న జాతకుడు అపారధనవంతుడు, పరరక్షకుడు, బహుమేధావి,
పుత్రులతో ఆశీర్వదింపబడినవాడు అగును. శుక్రుడు షష్టమమునయున్న జాతకుడు
శతృవులు లేనివాడు, నిర్ధని, యువతీజనముచేత మోసగించబడినవాడు, విచారగ్రస్తుడు
అగును. శుక్రుడు సప్తమమునయున్న జాతకుడు సత్కళత్ర సంపన్నుడు అయిననూ
పరస్త్రీరతుడు, విగతకళత్రుడు. ధనవంతుడూ అగును. శుక్రుడు అష్టమమున యున్న
జాతకుడు చిరంజీవి, ధనవంతుడూ, రాజూ అగును.
శుక్రుడు భాగ్య, రాజ్య, లాభ, రిఃఫ స్థానములయందున్న ఫలము :
శుక్రుడు భాగ్యమునందున్న జాతకుడు భార్యా, సంతతీ, ఆప్తులూ కలిగి మరియూ
రాజాశ్రయముచేత అభివృద్ధి చెందువాడునూ అగును. శుక్రుడు రాజ్యకేంద్రమునయున్న
జాతకుడు మిక్కిలి ప్రఖ్యాతవంతుడు, మిత్రులు కలిగి ప్రభువుగనూ యుండును.
సంతోషకరమగు వుద్యోగిగనూ యుండును. శుక్రుడు యేకాదశమునందున్న జాతకుడు
పరాంగనాపరుడూ, బహుసుఖీ యగును. శుక్రుడు ద్వాదశమునందున్న జాతకుడు
సురతసౌఖ్యప్రదుడు, ధనవంతుడూ యగును.
శని:-
లగ్నాది ద్వాదశ రాశులయందు శని యున్న ఫలము :
శని స్వరాశులయిన మకర కుంభములయందుండి లగ్నమయిననూ, తన ఉచ్ఛస్థానమయిన
తులయందుండ అది లగ్నమయిననూ జాతకుడు రాజతుల్యుడు, ప్రధానాధికారి, నగరపాలకుడు
అగును. ఇతర రాశులయందుండగా అవి లగ్నములయిన జాతకుడు బాల్యమునుండి
దుఃఖపరితప్తుడు, నిస్సహాయుడు, మలినాంబరధారి, నీరసి అగును.
శని ద్వితీయ, తృతీయ భావములయందున్న ఫలము :
శని ద్వితీయమునయున్న జాతకుడు జుగుప్స కలిగిన మోము కలవాడు, నిర్ధనుడు,
అన్యాయవర్తనుడు, కాలక్రమమున దూరములయందు నివసించువాడు, మరియూ ధనవాహనములు
కలవాడగును. శని తృతీయ భావమునయున్న జాతకుడు మిక్కిలి విజ్ఞానవంతుడు,
దానధర్మములయందుదారుడు, భార్యాసమేతుడయి సుఖములను బడయువాడు, నిరుత్సాహి,
దుఃఖము లేనివాడు యగును.
శని చతుర్ధ, పంచమ, షష్టి, సప్తమ స్థానములయందున్న ఫలము :
చతుర్ధమయిన శనియున్న జాతకుడు సుఖము లేనివాడు, గృహములేనివాడు,
వాహనములేనివాడు, బాల్యమున అనారోగి, తల్లిని పీడించువాడు అగును. పంచమభావమున
శనియున్న జాతకుడు తిరుగాడుట, అజ్ఞాని, సుతధనసుఖహీనుడూ, దురభిమాని,
దురాలోచనాపరుడూ అగును. శని షష్టమమునయున్న జాతకుడు తిండిపోతు, ధనవంతుడు,
శతృవులచేత ఓడింపబడినవాడు, దుశ్చరితుడు, మానవంతుడు అగును. శని సప్తమమునయున్న
జాతకుడు కళత్రయుతుడు, తిరుగాడువాడు, భయకంపితుడు అగును.
శని అష్టమ స్థానమునయున్న ఫలము :
అష్టమమున శని యున్న జాతకుడు శుభ్రములేనివాడు, నిర్ధనుడు, మూలశంక మొదలగు
రోగపీడితుడు, కౄరమనస్కుడు, క్షధార్తుడు, సుహృజ్జనుల అవమానింపబడినవాడు
అగును.
శని భాగ్య, రాజ్య, లాభ, వ్యయ స్థానములనున్న ఫలము :
భాగ్యస్థానమున శనియున్న జాతకునకు అదృష్టము - ఆస్తి - సంతతి - పితృధర్మము
మొదలుగునవి యేమియూ వుండవు. మోసకారి యగును, శని దశమమునయున్న జాతకుడు రాజు
కానీ, అమాత్యుడు గానీ యగును. వ్యవసాయమున అభిరుచి, ధైర్యవంతుడు, ధనవంతుడు,
ఖ్యాతి గలవాడు అగును. శని యేకాదశములో యున్న జాతకుడు చిరంజీవి,
బహుసంపాదనాపరుడు, స్థిరసంపదలు కలవాడు, నిరోగవంతుడు అగును. ద్వాదశమున
శనియున్న జాతకుడు నిర్లజ్జాపరుడు, నిర్ధనుడు, అపుత్రవంతుడు, అంగవికలుడు,
మూర్ఖుడు, శతృవులచేత త్రోలబడినవాడు అగును.
రాహు:-
రాహువు లగ్న, ద్వితీయ, తృతీయ, చతుర్ధముల యందున్న ఫలము :
రాహువు లగ్నమునయున్న జాతకుడు అల్పాయుర్దాయువంతుడు, ధనము ధారుడ్యము
కలవాడు, ఊర్ద్వాంగములగు శిరోముఖములయందు రోగములు కలవాడు అగును. రాహువు
ద్వితీయభాగమునయున్న జాతకుడు సంశయపూరిత వాక్కులు గలవాడు, ముఖమున నోటియందునా
రోగములు గలవాడు, సునిశిత హృదయుడు, ప్రభుమూలకధనార్జనపరుడు, రోషవంతుడు సుఖీ
అగును. రాహువు తృతీయమున యున్న జాతకుడు పుట్టుకతోనే గర్వి, బ్రాతృవిరోధి,
స్థిరచిత్తుడు, చిరాయుష్మంతుడు, ధనీ అగును. రాహువు చతుర్ధమునయున్న జాతకుడు
దుఃఖకారకుడు, మూర్ఖుడు, అల్పాయుష్మంతుడు, అప్పుడప్పుడు సుఖవంతుడూ అగును.
రాహువు పంచమ, షష్ట, సప్తమ, అష్టమ స్థానములయందున్న ఫలము :
రాహువు పంచమమునయున్న జాతకుడు ముక్కుతో మాట్లాడు ధ్వని కలవాడు,
అపుత్రవంతుడు, కఠినాత్ముడు, గర్భముయొక్క రోగములు కలవాడు అగును. రాహువు
షష్టమమునయున్న జాతకుడు శతృవులచే బాధలనొందువాడు ; లేక గ్రహబాధలు కలవాడు,
గుహ్యాదియందురోగము కలవాడు, ధనవంతుడు, చిరంజీవి అగును. సప్తమమౌన రాహువు
యున్న జాతకుడు పరాంగనారహ : కేళీవిలాసముయందు నష్టము పొందినవాడు,
ఆత్మీయులనుంచి విడిపోవుటవలన వ్యథలపాలయినవాడు, మానవత్వము కోల్పోయినవాడు,
పాపి, స్వాతంత్రభావములు కలవాడు ( ఇతరుల భావములు విననివాడు ) అగును. రాహువు
అషటమమునయున్న జాతకుడు అల్పాయుషమంతుడు అపవిత్రకార్యాసక్తుడు, అంగవైకల్యమును
పొందినవాడు, వికలతచెందినవాడు, వాతప్రకృతి కలవాడు, అల్పసంతతి కలవాడు అగును.
రాహువు భాగ్య, రాజ్య, లాభ, రిఃఫ స్థానములయందున్న ఫలము :
రాహువు నవమభాగమునయున్న జాతకుడు ప్రతికూలవాక్కులుగలవాడు, కులపెద్ద,
గ్రామపెద్ద, పట్టణమునకు అధిపతి, పాపక్రియాపరుడు అగును. రాహువు దశమమందున్న
జాతకుడు ప్రఖ్యాతి వహించినవాడు, అల్పసంతానవంతుడు, పరకార్యములు చేయ్వాడు,
నిర్భయుడు, సత్కర్మరహితుడు అగును.
రాహువు లాభస్థానమునయున్న జాతకుడు అభివృద్ధిపరుడు, స్వల్పసంతానవంతుడు,
చిరంజీవి మరియూ కర్ణరోగి యగును. అనియూ, రహువు ద్వాదశస్థానమునయున్న జాతకుడు
రహస్యకృత దురాచారములు కలవాడు, యెక్కువ ఖర్చు చేయువాడు, శరీరమున జలసంబంధమగు
రోగము కలవాడు అగును .
కేతు:-
లగ్న ద్వితీయ భావములయందున్న కేతువు ఫలము :
లగ్నమున కేతువుయున్న జాతకుడు కృతఘ్నుడు, సుఖములేనివాడు, యితరుల
విషయములలో కొండెములు చెప్పువాడు అగును. మరియూ జాతిభ్రష్టుడు,
స్థానభ్రష్టుడూ, అసంపూర్ణమగు అవయవములు కలవాడు, మాయావులతో కలిసియుండు వాడు
అగును. కేతువు ద్వితీయభావమునయున్న జాతకుడు విద్యాహీనుడు, నిర్దనుడు,
అల్పపదప్రయోగి, కుదృష్టిపరుడు, పరాన్నభుక్కుయగును.
కేతువు తృతీయ, చతుర్ధ భావములయందున్న ఫలము :
కేతువు తృతీయ భావమునయున్న జాతకుడు చిరంజీవి, శక్టిసంపన్నుడు, ఆస్తి -
కీర్తి కలవాడును భార్యాసమేతముగా సంతోషజీవితము గౌడ్పును. సుఖాన్న ప్రాప్తిని
పొందును. సోదరుని కోల్పోవును. కేతువు చతుర్ధమునయున్న జాతకుడు భూ, మాతృ,
వాహన, సుఖములను కోల్పోవును. స్వస్థానములు వీడి అన్యప్రదేశములయందుండును.
పరులధనాపేక్షతో జీవించువాడు యగును.
కేతువు పంచమ, షష్ట స్థానములయందున్న ఫలము :
కేతువు పంచమమునయున్న జాతకుడు గర్భజ్కోశవ్యాధి పీడితుడు,
సంతతినష్టపోవువాడు, పిశాచపీడలచే బాధలనొందువాడు, దుర్భుద్దిపరుడు, మోసగాడు
అగును. కేతువు షష్టమునయున్న జాతకుడు ఔదార్యవంతుడు, వుత్తమగుణములు కలవాడు,
ధృడచిత్తుడు, విపులకీర్తివంతుడు, వున్నతోద్యోగి, శతృనాశనపరుడు, కోరికలు
సిద్ధించువాడు అగును.
కేతువు సప్తమ, అష్టమ స్థానములందున్న ఫలము :
కేతువు సప్తమమునయున్న జాతకుడు అగౌరవము పోమ్దుఅవడు, దుష్టస్త్రీ సమేతుడు,
అంతర్గత రోగపీడితుడు, భార్య మరియు శక్తినష్టములచేత బాధపడువాడు అగును.
కేతువు అష్టమమునయున్న జాతకుడు అల్పాయుష్మంతుడు, ప్రాణమిత్రులను
విడిచినవాడు, కలహములతో జీవించువాడు, ఆయుధములవలన ఘాత పొందినవాడు, తానుచేయు
పనులయందు నిరాశా నిస్పృహలు కలవాడు అగును.
కేతువు భాగ్య, రాజ్యములయందున్న ఫలము :
కేతువు తొమ్మిదవయింటయున్న జాతకుడు పాపప్రవృత్తిపరుడు, అశుభవంతుడు,
పితృదేవులను అణచినవాడు, దురదృష్టవంతుడు, ప్రసిద్ధులను దూషించువాడు అగును.
కేతువు రాజ్యకేంద్రమునయున్న జాతకుడు సత్లర్మలయందు విఘ్నములు కలవాడు,
మలినుడు, నీచక్రియాసక్తుడు, శక్తిమంతుడు, బహుకీర్తిమంతుడు అగును.
కేతువు ఏకాదశ, వ్యయ స్థానములయందున్న ఫలము :
కేతువు లాభమునయున్న జాతకుడు అఖండ ధనవంతుడు, బహుగుణవంతుడు, భోగి,
మంచివస్తువులు పొందుటకాస్కారము కలవాడు, తనకవసరమగు ప్రతీపనియందునా విజయము
పొందువాడు అగును. కేతువు ద్వాదశమమున యున్న జాతకుడు రహస్యముగా దురాచారములు
చేయువాడు, అధమక్రియాకలాపవశ ధననాశనము పొందినవాడు, అస్తిని నాశనము చేయువాడు,
విరుద్ధమైననడతలు కలవాడు, నేత్రరోగి యగును.