ఉచ్చస్థానాలు - నీచస్థానాలు
ఖాళీస్థలం, గృహం రెండింటికీ ఉచ్ఛనీచ స్థానాలు ఉంటాయి. గేట్లు, ద్వారాలు కూడా అటు ఇంటికి, ఇటు కాంపౌండ్ వాల్స్‌కు ఉచ్ఛస్థానాలలో ఉండాలి. అలా ఉంటే నడక ఉచ్ఛస్థానంలో ఉంటుంది. ఇలా ఉచ్ఛస్థానంలో నడక సాగించడం వలన ఆ గృహంలో నివశించే వారికి ఎంతో మేలు జరుగుతుంది. నీచస్థానంలో ద్వారాలు, గేట్లు, నడక ఉండడం ఏ మాత్రం వాస్తు రీత్యా మంచిది కాదు. ఈ ఇంట నివశించే వారి జీవితాలలో మంచికన్నా కీడు అధికంగా ఉంటుంది.
కనుక ముందుగా గృహంలో, స్థలంలో ఉచ్ఛ నీచాలు ఏమిటన్నది వివరంగా తెల్సుకుందాం. కాంపౌండ్‌వాల్‌ను కానీ, ఇంటి గోడల్ని కానీ మూడు భాగాలుగా చేయండి. ఈ వివరాలు మరింత వివరంగా తెల్సుకుందాం.
తూర్పు గోడను తీసుకుందాం. మూడు భాగాలు చేద్దాం. ఉత్తరానికి దగ్గరగా తూర్పు ఈశాన్యాన్ని తాకుతూ ఉండే భాగం ఉచ్ఛస్థానం. అలానే దక్షిణానికి దగ్గరగా తూర్పు ఆగ్నేయాన్ని తాకుతూ ఉండే స్థానం నీచస్థానం.
ఉత్తరపు గోడ విషయానికొస్తే... దీన్ని మూడు భాగాలుగా చేయండి. ఉత్తర ఈశాన్యాన్ని తాకుతూ తూర్పు దిశగా ఉండే భాగం ఉచ్ఛస్థానం. ఉత్తర వాయువ్యాన్ని తాకుతూ పడమర దిక్కున ఉండే స్థానం నీచస్థానం.
పడమర గోడ విషయానికొస్తే... మూడు భాగాలతో పడమర వాయువ్యాన్ని తాకుతూ... ఉత్తరంలో ఉండే భాగం ఉచ్ఛస్థానం. అలానే దక్షిణాన్ని తాకుతూ పడమర నైఋతిలో ఉండే భాగం నీచస్థానం.
దక్షిణం గోడను కూడా ఇలానే మూడు భాగాలు చేయండి. ఈ గోడలో... పడమర దిక్కుగా దక్షిణ నైఋతిని తాకుతూ ఉండే భాగం నీచస్థానం. అలానే తూర్పు దిశగా దక్షిణ ఆగ్నేయాన్ని తాకే భాగం ఉచ్ఛస్థానం. ఈ కారణంగానే.. కాంపౌండ్‌వాల్ గేట్లయినా.. ఇంటి గుమ్మాలయినా ఉచ్ఛస్థానాలలో ఉండేలా జాగ్రత్త వహించమంటుంది వాస్తుశాస్త్రం