శని:-
లగ్నాది ద్వాదశ రాశులయందు శని యున్న ఫలము :
శని స్వరాశులయిన మకర కుంభములయందుండి లగ్నమయిననూ, తన ఉచ్ఛస్థానమయిన
తులయందుండ అది లగ్నమయిననూ జాతకుడు రాజతుల్యుడు, ప్రధానాధికారి, నగరపాలకుడు
అగును. ఇతర రాశులయందుండగా అవి లగ్నములయిన జాతకుడు బాల్యమునుండి
దుఃఖపరితప్తుడు, నిస్సహాయుడు, మలినాంబరధారి, నీరసి అగును.
శని ద్వితీయ, తృతీయ భావములయందున్న ఫలము :
శని ద్వితీయమునయున్న జాతకుడు జుగుప్స కలిగిన మోము కలవాడు, నిర్ధనుడు,
అన్యాయవర్తనుడు, కాలక్రమమున దూరములయందు నివసించువాడు, మరియూ ధనవాహనములు
కలవాడగును. శని తృతీయ భావమునయున్న జాతకుడు మిక్కిలి విజ్ఞానవంతుడు,
దానధర్మములయందుదారుడు, భార్యాసమేతుడయి సుఖములను బడయువాడు, నిరుత్సాహి,
దుఃఖము లేనివాడు యగును.
శని చతుర్ధ, పంచమ, షష్టి, సప్తమ స్థానములయందున్న ఫలము :
చతుర్ధమయిన శనియున్న జాతకుడు సుఖము లేనివాడు, గృహములేనివాడు,
వాహనములేనివాడు, బాల్యమున అనారోగి, తల్లిని పీడించువాడు అగును. పంచమభావమున
శనియున్న జాతకుడు తిరుగాడుట, అజ్ఞాని, సుతధనసుఖహీనుడూ, దురభిమాని,
దురాలోచనాపరుడూ అగును. శని షష్టమమునయున్న జాతకుడు తిండిపోతు, ధనవంతుడు,
శతృవులచేత ఓడింపబడినవాడు, దుశ్చరితుడు, మానవంతుడు అగును. శని సప్తమమునయున్న
జాతకుడు కళత్రయుతుడు, తిరుగాడువాడు, భయకంపితుడు అగును.
శని అష్టమ స్థానమునయున్న ఫలము :
అష్టమమున శని యున్న జాతకుడు శుభ్రములేనివాడు, నిర్ధనుడు, మూలశంక మొదలగు
రోగపీడితుడు, కౄరమనస్కుడు, క్షధార్తుడు, సుహృజ్జనుల అవమానింపబడినవాడు
అగును.
శని భాగ్య, రాజ్య, లాభ, వ్యయ స్థానములనున్న ఫలము :
భాగ్యస్థానమున శనియున్న జాతకునకు అదృష్టము - ఆస్తి - సంతతి - పితృధర్మము
మొదలుగునవి యేమియూ వుండవు. మోసకారి యగును, శని దశమమునయున్న జాతకుడు రాజు
కానీ, అమాత్యుడు గానీ యగును. వ్యవసాయమున అభిరుచి, ధైర్యవంతుడు, ధనవంతుడు,
ఖ్యాతి గలవాడు అగును. శని యేకాదశములో యున్న జాతకుడు చిరంజీవి,
బహుసంపాదనాపరుడు, స్థిరసంపదలు కలవాడు, నిరోగవంతుడు అగును. ద్వాదశమున
శనియున్న జాతకుడు నిర్లజ్జాపరుడు, నిర్ధనుడు, అపుత్రవంతుడు, అంగవికలుడు,
మూర్ఖుడు, శతృవులచేత త్రోలబడినవాడు అగును.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
parakrijaya@gmail.com