పంచకరహితం అంటే?
ఏదైనా ముహూర్తమును నిర్ణయించ దలచుకున్నప్పుడు ఆ ముహూర్తమునకు పంచక రహితం అయ్యిందో లేదో చూసుకోవాలి. ముహూర్త సమయానికి ఉన్న తిథి - వార - నక్షత్ర - లగ్న ములు అను నాలుగింటిని కలిపి తొమ్మిదిచే భాగించగా వచ్చిన శేషం 1 తప్ప మిగిలిన బేసి సంఖ్యలైతే శుభం.
అదే శేషం 1 అయితే మృత్యు పంచకం. ఇది అస్సలు మంచిదికాదు. ఆ ముహూర్తమునకు చేసే శుభకార్యము వలన మృత్యువు సంభవించ వచ్చును.
2 అయితే అగ్ని పంచకం. దీని వలన అగ్నిప్రమాదములు జరుగుతాయి.
4 అయితే రాజ పంచకం. అనుకోని అవాంతరాల వలన కార్యం ఆగిపోవచ్చు.
6 అయితే చోర పంచకం. కార్యక్రమంలో కొన్ని దొంగలచే దొంగిలించ బడతాయి.
8 అయితే రోగ పంచకం. కార్యక్రమంలో ప్రధాన వ్యక్తులు రోగముచే బాధపడతారు.
కనుక శేషంగా 1,2,4,6,8 అను ఐదు సంఖ్యలు ( పంచకములు ) వస్తే అవి శుభప్రదం కాదు. ఆముహూర్తమును వదిలి పెట్టవలెను.
అయితే తప్పని సరి పరిస్థితులలో .....
చోర రోగ త్యజే రాత్రౌ దివారాజాగ్ని మేవచ
అహోరాత్రం త్యజేత్ మృత్యుః పంచకాని విచారయేత్
అని చెప్పుటచే చోర, రోగ పంచకములను రాత్రి ముహూర్తంలో త్యజించాలి( పగలైతే ఉపయోగించ వచ్చును ). రాజ, అగ్ని పంచకములను పగటి ముహూర్తాలలో వదిలివేయాలి ( రాత్రి స్వీకరించ వచ్చును ). మృత్యు పంచకమును ఎల్లప్పుడూ వదిలివేయాలి.
మృత్యు, అగ్ని, రాజ, చోర, రోగ ములను ‘పంచకము’ అంటారు. ఇవి ‘రహితం’ చేసుకుని ముహూర్తము నిర్ణయించడాన్నే "పంచక రహితం " అంటారు.
ఉదాహరణ : 19- 01-2012 సా.గం. 17-04 ఏదైనా శుభముహూర్తం నిర్ణయించాలనుకున్నాం.
ఈ సమయానికి ( ముహూర్తానికి ) పంచక రహితం అయ్యిందో లేదో చూద్దాం.
తిథి మొదలైనవి పంచాంగంలో చూసుకోవాలి.
19 తేదీ నాడు గురువారం, ఏకాదశి రా. 7.30 వరకు, అనూరాధ నక్షత్రం రా. 7-10 వరకు ఉన్నాయి. ఈ రోజు సా. 03-14 నుండి 05-26 వరకు మిథున లగ్నం ఉంది.
వారం గురువారం - ఆదివారంనుంచి మొదలుపెడితే గురువారం ఐదవది. అనగా దీని సంఖ్య 5 అవుతుంది.
తిథి సాయంత్రం 7-30 లోపే మన ముహూర్తం ఉంది కనుక ఏకదశి తిథినే తీసుకోవాలి. తరువాత అయితే ద్వాదశి తిథిని తీసుకోవాలి. ( కొందరు సూర్యోదయానికి ఉన్నతిథినే ఆ రోజంతా లెక్కించాలి అంటున్నారు. కానీ అది సరి అయినది కాదు. ఆ సమయానికి ఏ తిథి ఉంటే అదే తీసుకోవాలి. ) కనుక ప్రస్థుతం ఏకాదశి తిథి. అంటే పాడ్యమి నుండి మొదలు పెడితే ఏకాదశి 11 వ తిథి అవుతుంది. అనగా దీని సంఖ్య 11 అవుతుంది.
నక్షత్రం అనూరాధ. అశ్వని మొదలు అనూరాధ 17 వ తార. కనుక దీని సంఖ్య 17 అవుతుంది.
లగ్నం మిథునం. మేషం మొదలు మిథునం 3 వ రాశి కనుక దీని సంఖ్య 3 అవుతుంది.
ఇప్పుడు ఇవన్నీ వరసగా రాసుకుని కూడదాం.
తిథి + వారము + నక్షత్రము + లగ్నము
ఏకదశి + గురువారం + అనూరాధ + మిథునం
11 + 5 + 17 + 3 = 36 దీనిని 9 తో భాగహరించాలి.
9) 36 ( 4
36
-----
శేషం 0
-----
సున్నా అంటే 9 గా భావించాలి. తొమ్మిది 'బేసి` సంఖ్యకనుక ఈ ముహూర్తానికి పంచక రహితం అయినది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
parakrijaya@gmail.com