సంపూర్ణ సూర్య గ్రహణము~~~తీసుకోవలసిన జాగ్రత్తలు :)
********************
ప్రారంభ కాలం : ఉ 4 - 49 ని||
మధ్యకాలంల : 7-27 ని||
అంత్యకాలం : 10 -05 ని||
*********************
"అందరికీ ఉపయోగపడేవిధంగా ఈ పోస్ట్ ని అందరూ షేర్ చేయగలరు
9-3-2016 బుధవారం పూర్వాభాద్ర నక్షత్రం ద్వితీయ పాదం నందు కేతుగ్రస్త సూర్య గ్రహణం సంభవిస్తుంది. సూర్య గ్రహణము అమావాస్య నాడు మాత్రమే వస్తుంది. అన్నీ అమావాస్యలకు సూర్యగ్రహణం ఏర్పడదు. సూర్యుడు, చంద్రుడు అమావాస్యనాడు భూమికి ఒకవైపు ఉంటారు. సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే సరళ రేఖపై ఉండి చంద్రుడు రాహువు లేదా కేతువుస్ధానంలో ఉన్నప్పుడు మాత్రమే సూర్యగ్రహణం ఏర్పడుతుంది. పూర్తి సూర్యగ్రహణ సమయం 8 నిమిషాలకు మించి ఉండదు. సూర్యుడికి, భూమికి మధ్య చంద్రుడు రావడం వల్లనే సూర్యగ్రహణం ఏర్పడుతుంది. దీంతో భూమిమీద కొంత భాగానికి సూర్యుడు కనిపించకుండా పోతాడు. సంపూర్ణ సూర్యగ్రహణం సంభవించే సమయంలో స్థానిక ఉష్ణోగ్రత కూడా భారీగా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. మనదేశంలోనివారు "రాహువు" అనే రాక్షసుడు సూర్యుడిని మింగేయటంవల్లనే గ్రహణం ఏర్పడుతుందని బలంగా నమ్ముతారు.
ఆధ్యాత్మికంగా గ్రహణం సమయానికి చాలా విశేషముంది. గ్రహణం పట్టగానే నదీ స్నానం చేసి, నదీ తీరాన జపం చేసుకుంటే ఆ ఫలితం ఇంకా ఎక్కువ. గ్రహణ స్పర్శ కాలమున నదీస్నానం, మద్యకాలమున తర్పణం, జపము, హోమం, దేవతార్చన విడువుచుండగా దానం, స్నానం చేయటం మంచిది. గ్రహణ కాలమున భాగవన్నామస్మరణ చేయటం ఉత్తమం. గురువు ఉపదేశించిన మంత్రజపము, వశీకరణం, శత్రుపీడనం నుంచి విముక్తి లభించేందుకు, మనసు ప్రశాంతంగా ఉండేందుకు గాయత్రి మంత్ర జపము గ్రహణ కాలమందు మరియు ఏడురోజుల వరకు తప్పనిసరిగా ఆచరించవలెను. గ్రహణం రోజు ఉపవాస దీక్ష చేస్తే మంచిది. గ్రహణ సమయమందు గో భూ హిరణ్యాది (గోవులను, భూములను, బంగారాన్ని) దానములు చేయవలెను.
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం జన్మ నక్షత్ర, రాశ్యాదులలో గ్రహణం చెడు ఫలితాలను ఇస్తుంది. ఎవరి జన్మరాశి యందు, జన్మ నక్షత్రమందు గ్రహణం కలుగునో వారికి విశేషముగా పూజలు, జపాలు, దానాలు చేసుకోవలెను. గ్రహణం పడిన నక్షత్రమందు ఆరు నెలలు ముహూర్తాలు నిషేదిస్తారు. జన్మరాశి నుండి 3,6,10,11 రాసులలో గ్రహణమైన శుభప్రధం 2,5,7,9 రాసులందు గ్రహణమైన మధ్యమం. మిగిలిన రాసులందు గ్రహణమైన అరిష్టం.
మతాంతరంలో గర్గుడు జన్మరాశి నుండి 7,8,9,10,12 లలో గ్రహణమైతే అరిష్టమని, రాహువు జన్మ నక్షత్రమందు లేదా 7 వ నక్షత్రమందు ఉన్న అరిష్టం అని తెలియజెప్పాడు.
మరొక మతాంతరంలో రాహువు ఏ నక్షత్రంలో ఉండి సూర్య,చంద్రులను మ్రింగుతాడో ఆ నక్షత్ర జాతకులకు చెడు జరుగుతుందని తెలియజెప్పారు.
మరొక మతాంతరంలో గ్రహణం త్రిజన్మ నక్షత్రాలలో అనగా జన్మ నక్షత్రానికి ముందు నక్షత్రం, వెనుక నక్షత్రాలలో పడుతుందో రోగం సంభవిస్తుందని చెప్పటం జరిగింది. సూర్యగ్రహణ ప్రభావం ఆరు నెలల వరకు ఉంటుంది.
సూర్యగ్రహణ దోష నివారణకు దానం, హోమం,జపం,దేవతార్చన,అభిషేకం, శక్తి కలిగిన వాళ్ళు బంగారంతో చేసిన నాగప్రతిమను, శక్తి లేనివారు శిలరూపంలో చెక్కిన నాగ ప్రతిమను గాని, పిండితో చేసిన నాగప్రతిమను గాని బ్రాహ్మణునికి, లేదా దేవాలయం నందు సూర్యబింబంతో(కాపర్,వెండి,బంగారం,స్పటికం) సహా దానం చేసిన మంచిది.
ఎవరి జన్మ రాశి, జన్మ నక్షత్రంలో గ్రహణం సంభవిస్తుందో ఔషదములతో కూడిన స్నానమాచరించిన గ్రహణ దోషం తొలగిపోవును. మణిశిల, యాలకులు, దేవదారు, కుంకుమపువ్వు, వట్టివేళ్ళు, గోరోచనం, కస్తూరి, కుంకుమ, ఎర్ర పుష్పాలు, ఎర్రగన్నేరు, రక్త చందనం, చెరువు మట్టి లేదా, పుట్ట మట్టి, గోశాల మట్టి గాని తెప్పించుకొని గ్రహణమునకు ముందే కలశ కుంభములందు ఉంచి దేవతలను ఆవాహనం చేసుకొని “ఓం సూర్యాయనమః” అంటూ స్నానమాచరించాలి. శక్తి కొలది బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి. హోమం చేయశక్తి లేనివారు నాల్గింతలు జపం చేయాలి.
సూర్యగ్రహణానికి ముందు 12 గంటలు వేదకాలము. ఈ వేదకాలం నందు భోజనం చేయరాదు. చిన్నపిల్లలు, వృద్ధులు కనీసం మూడు లేదా ఆరు ముహూర్త కాలమందు వేదకాలంగా పాటించి భోజనం చేయరాదు. అలా కాకుండా భోజనం చేసిన నరకమును, శయనించితే రోగం, మూత్రం చేసిన దారిద్ర్యం కలుగును. తైలాభ్యంగన స్నానం చేసిన కుష్ఠు రోగం వచ్చును.
గ్రహణసమయములో ఉపవాసము ,తినే పదార్దాలు ఫై దర్భలు వేయడం చూస్తూ ఉంటాము. ఈతరం వాళ్ళకు అది వింతగాను, మూర్ఖంగాను కనిపించవచ్చు. ఆలాగే గ్రహణానికి కొన్ని గంటలముందు నుంచే ఉపవాసం ఉండడం విడ్డూరంగా ఉంటుంది . విక్రం సారాభాయ్ పరిశోధన కేంద్రం వారి పరిశోధనలో గ్రహణ సమయంలో సూర్యకాంతి పడిన నీరు కలుషితం అవుతుందని దీనిని నివారించటంలో దర్భలు శ్రేష్టమైన ఓషధ గుణాలు కలిగి ఉన్నాయని సైంటిఫిక్ గా పరిశోధనలు చేసి ఋజువులతో తెలియజేశారు. దీని ప్రకారం తినే పదార్ధాలఫై వేసిన ధర్బలు తులసి దళముల కంటే ఎక్కువుగా చెడును కలిగించే కిరణములను నిరోదిస్తుంది అని చెప్పవచ్చు.
సూర్య గ్రహణసమయంలో సూర్యకిరణములలోని మార్పులు అనూహ్యoగా ఉండడంతో జీర్ణవ్యవస్థతో దీని ప్రభావం ఎక్కువుగా ఉంటుంది. అందుకనే జంతువులు కూడా ఆ సమయంలో ఆహారం ముట్టవని జైపూర్ జంతు ప్రదర్శనశాల వారి పరిశోధనలో బయటపడింది .ప్రకృతిపరంగా ఏర్పడిన ఈ మార్పుకు జంతువులు సైతం నియమాలు పాటిస్తున్నప్పుడు తెలివైన మానవుడు ప్రకృతికి బిన్నoగా ప్రవర్తించకూడదు. ఆ సమయములో ఏర్పడే కిరణాల ప్రభావం వల్ల శరీరంలోని మార్పులుకు అనుగుణంగా ఆ సమయంలో భోజనాలు చేయకుండ ఉంటే మంచిది అని పెద్దలు చెపుతుంటారు.ఆ క్షణంలో మార్పు కనిపించదు కాని దాని ప్రభావం తప్పకుండ ఉంటుంది.
గ్రహణ సమయంలో దేవాలయాలన్నీ మూసేస్తారు అసలు దేవాలయాల్ని ఎందుకు మూస్తారు అంటే ఆగమ శాస్త్రానుసారం గ్రహణ సమయంలో దేవాలయాల్ని మూసి, తర్వాత ప్రోక్షణ చేసి పూజలు ప్రారంభించాలి. అందుకే దేవాలయాలు మూసివేస్తారు.
గ్రహణం సమయంలో చేసే మానసిక జపం మామూలుగా చేసే దానికన్నా అనేక రెట్లు ఎక్కువ ఫలితాన్నిస్తుందంటారు. గ్రహణ సమయంలో ఆవు నెయ్యతో దీపారాధన చేసి, దాని ముందు కూర్చుని జపం చేస్తే, ఆ మంత్రంతో హోమం చేసినంత ఫలితాన్నిస్తుంది. అయితే అందరూ ఈ జపాలు చేయలేరు. శారీరకంగా అశక్తులు వుండవచ్చు, ఉద్యోగరీత్యా, ఇంకా ఇతర పనులవల్ల కుదరకపోవచ్చు. అలాంటివారు శాస్త్ర ప్రకారం సూర్య గ్రహణానికి 12 గం. ముందునుంచీ కడుపు ఖాళీగా వుండాలి. ఈ సమయంలో ఏమైనా తినటంవల్ల అనారోగ్యం కలుగవచ్చు.
గ్రహణాన్ని నేరుగా కళ్ళతో చూడకూడదు. కంటిలో వుండే సున్నితమయిన పొరలు దెబ్బతిని అంధత్వం వస్తుందని, ఎలాంటి ఉపకరణాలూ లేకుండా నేరుగా కంటితో గ్రహణాన్ని చూడటం వల్ల కంట్లో ఏర్పడే దోషాలను ఏ చికిత్సతోనైనా బాగు చేయటం చాలా కష్టమని ప్రసిధ్ధ కంటి వైద్య నిపుణులు అంటున్నారు.
గర్భం ధరించిన స్త్రీలు గ్రహణం రోజున బయట తిరిగితే అరిష్టమని భారతీయ స్త్రీలు ప్రగాఢంగా నమ్ముతారు. అందుకే కడుపుతో ఉన్నవారిని ఇంట్లోనే ఉంచుతారు. గ్రహణం ఉన్నంతసేపు వీరిని బయటికి రానివ్వరు. నిద్రపోనివ్వరు, ఇంట్లోనే మెల్లిగా నడవమని చెబుతుంటారు. గర్భం ధరించిన స్త్రీలు గ్రహణ సమయంలో ఇంటికే పరిమితమవ్వడం మంచిదని, అంతేగాక తమ నివాస గృహాలలో ఆ సమయంలో సూర్యుడి ఛాయలు పడకుండా జాగ్రత్తపడాలని , గ్రహణ సమయంలో ప్రసరించే అతినీలలోహిత కిరణాలు గర్భిణీ స్త్రీలపై తీవ్ర ప్రభావం చూపుతాయని పండితులు హెచ్చరిస్తున్నారు. సూర్య కాంతికి కూర్చోకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూరగాయలు తరగడం.. ఇత్యాది వంట పనులు చేయకూడదు. గర్భస్ధ శిశువుల మీద గ్రహణ సమయంలో కిరణాల ప్రభావం చాలా వుంటుందని డా. అపర్ణా సక్శేనా గర్భస్ధ ఎలుకలమీద చేసిన ప్రయోగాలతో కనుగొన్నారు. ఆ కిరణాలలో వుండో రేడియో ధార్మిక శక్తి వలన ఆ ఎలుకలకి పుట్టిన పిల్లలలో ఎముకలు, మజ్జలో లోపాలు, అవయవాలు సరిగ్గా తయారు కాకపోవటం వగైరా లోపాలు కనుగొన్నారు. అందుకే గర్భిణీలు గ్రహణ సమయంలో బయట తిరగకూడదన్నారు.
మన పూర్వీకులు ఏ సైన్స్ ఏ పరిశోధనలు లేని కాలంలో ఎంతో విజ్ఞానంతో, ఎంతో దూరం ఆలోచించి, ఎన్నో తరాలదాకా ప్రజలకి మేలు చేసే విషయాలను తెలియజెప్పారు. వాటిని పాటించి శుభాల కోసం ప్రయత్నం చేద్దాం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
parakrijaya@gmail.com